కొండగట్టు బాధితుల గోడు పట్టని కెసిఆర్

దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు జరుగానంతటి భారీ బస్సు ప్రమాదం జరిగి, మృతుల సంఖ్య 60కు చేరుకున్నా సంతాప సందేశం ఇవ్వడం మినగా వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి, బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేయనే లేదు. కనీసం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించే తీరిక ఆయనకు చిక్క లేదు.

బాధిత కుటుంభాలకు మృతుల అంత్యక్రియలకు సహితం తగు సహకారం ప్రభుత్వపరంగా అందించే ప్రయత్నం చేయడం లేదు. ఈ  ప్రమాదంలో చనిపోయిన వారు మూడు శవాలను ఫ్రిజ్ర్ లో పెట్టుకుని ఆర్థిక స్తోమత లేక  మంచు గడ్డలతో, ఊక కప్పి పెట్టి, దుబాయ్ లో ఉన్న అయిన వారి కడసారి చూపు కోసం ఎదురు చూస్తున్న హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో 2004 లో వాటర్ టాంక్ కూలి 20 మందికి పైగా చనిపోయారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వై యస్ రాజ శేఖర్ రెడ్డి వెంటనే అక్కడకు వచ్చి పరామర్శించారు. రామడుగు మండలం వేదిర లోని మాతా స్కూల్ బస్ బావిలో పడి 15 మంది పైన పిల్లలు చనిపోయిన సంఘటన లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుడా వెంటనే వచ్చారు. మరి 60 మందికి పైగా చనిపోయిన కూడా ఆపద్ధర్మ  సీఎంకు తీరిక చిక్కక పోవడం గమనార్హం.

మృతదేహాలకు జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ ఘటనలో రాంసాగర్‌, హిమ్మత్‌రావుపేట్‌, తిమ్మయ్యపల్లె, శనివారంపేట గ్రామాలకు చెందిన వారే దాదాపు 40 మంది మృతి చెందారు. వారి అంత్యక్రియలను బుధవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ గ్రామాల్లో భారీ వర్షం కురుస్తుండడంతో అంత్యక్రియలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో బంధువులు ఇబ్బందులకు గురయ్యారు.

కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 101 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపు తప్పి బస్సు లోయలో పడిన్నట్లు భావించ వలసి వస్తుంది.