వరద వరద బాధితులకు తక్షణ సాయం 5వేలు

గోదావరి ముంపు ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పుడిస్తున్న సహాయం తోపాటు అదనంగా రూ. 5 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఉంటున్నవారికి భోజన సదుపాయాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు, ఇళ్లు, పంట నష్టపోయినా... నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా ఈ ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. 

రాజమండ్రి విమానాశ్రయంలోని ఎటిసి టవర్‌ బిల్డింగ్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ముంపు ప్రాంతాలకు సహాయక చర్యలపై సిఎం అధికారులతో గురువారం సమీక్షించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70 శాతానికి పైగా గిరిజన గ్రామాలున్నాయని, వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిన్నదని చెప్పారు. వరదల కారణంగా సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు పడుతున్న గ్రామాలకూ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. 

పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో సాగుచేసిన పంటలు వరదల కారణంగా దెబ్బతింటే.. అక్కడ వారికి పరిహారంతోపాటు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా దేవీపట్నం సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో 10-11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా పెద్దగా ముంపు ఉండేదికాదని, ఈసారి ముంపు ఎక్కువగా ఉందని అధికారులు, ఎమ్మెల్యేలు సిఎంకు వివరించారు. 

కాఫర్‌ డ్యాం కారణంగా ముంపు పెరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. పోలవరం పునరావాస పనులు చేపట్టాలని, త్వరగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. పోలవరం పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఐఎఎస్‌ అధికారిని నియమిస్తున్నామని తెలిపారు.