జమ్మూ కశ్మీర్‌లో జరిగిన అన్యాయం వెనుక పాక్‌ హస్తం

ఆర్టికల్‌ 370ని అడ్డం పెట్టుకుని జమ్మూ కశ్మీర్‌లో జరిగిన అన్యాయం వెనుక పాక్‌ హస్తం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇకపై కశ్మీర్‌ అభివృద్ది పథంలో ప్రయాణిస్తుందని భరోసా ఇచ్చారు. కశ్మీర్‌ విభజన తరువాత ప్రధాని తొలిసారిగా గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్‌లో కొత్త శకం ప్రారంభమైందన్నారు. కశ్మీర్‌, లదాఖ్‌ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. 

ఆర్టికల్‌ 370 వల్ల కశ్మీర్‌, లదాఖ్‌ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఇంతకాలం చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు ఒకటే భారత్‌- ఒకటే రాజ్యంగం అనే కల నెరవేరిందన్నారు. ఆర్టికల్‌ 370 జమ్మూ కశ్మీర్‌లో ఏం జరిగిందని ప్రశ్నించారు. 

 ‘ఆర్టికల్‌ 370,35ఏల వల్ల కశ్మీర్‌ ప్రజలకు ఏమీ ఒరగలేదు. కశ్మీర్‌లోని పిల్లలకు కనీసం చదువు కూడా అందలేదు. ఈ ఆర్టికల్స్‌ ద్వారా కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగింది. ఆర్టికల్‌ 370ని పాకిస్తాన్‌ ఆయుధంలా వాడుకుంది. 42,000 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా ప్రయోజనం చేకూర్చే చట్టాలు కశ్మీర్‌ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి' అని తెలిపారు. 

ఆర్టికల్‌ 370 ఉగ్రవాదాన్ని పోత్సహించడమే కాకుండా, కుటుంబ రాజకీయాలకు, అవినీతికి మాత్రమే తోడ్పడిందని ప్రధాని ధ్వజమెత్తారు. కశ్మీర్‌కు సాయం చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కశ్మీర్‌లో కార్మికులకు సరిగా వేతనాలు అందడం లేదని మండిపడ్డారు. మైనార్టీలకు రక్షణ కల్పించే చట్టాలు అక్కడ ఉండవని, దేశమంతా ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయి. కానీ కశ్మీర్‌లో ఇవేమీ ఉండవని గుర్తు చేశారు. 

కానీ ఇకపై.. దేశ అభ్యున్నతి కోసం చేసే చట్టాలు ఇకపై కశ్మీర్‌లో కూడా వర్తిస్తాయని ప్రధాని భరోసా ఇచ్చారు. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశామని తెలిపారు.   

కశ్మీర్‌లో కేంద్రపాలన తాత్కాలిమేనని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అక్కడి పరిస్థితులు మెరుగుపడ్డాక కేంద్ర పాలన ఉండదని స్పష్టం చేశారు. త్వరలోనే కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. 

‘‘పాకిస్థాన్‌ నుంచి కశ్మీర్‌కు వచ్చినవారికి ఎలాంటి హక్కులు లభించలేదు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ సంపూర్ణ హక్కులు లభించాయి..   కశ్మీర్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు స్థానికులకు అన్నింట్లో సమ భాగస్వామ్యం లభిస్తుంది' అని పేర్కొన్నారు. 

కశ్మీర్‌లో కొత్త నాయకత్వం ఉద్భవిస్తుంది. అభివృద్ధి కొత్త తీరాలకు చేరుతుంది. అక్కడి యువత నుంచి కొత్త నాయకులు పుట్టుకొస్తారు. కొత్త శాసనసభ్యులు, కొత్త ముఖ్యమంత్రులను మనం చూస్తాం. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ అద్భుత పరిపాలన అందిస్తున్నారని మోదీ కొనియాడారు.  

‘‘జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. పర్యాటక రంగంలో కశ్మీర్‌ను అత్యున్నతస్థాయిలో నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కశ్మీర్‌లో పర్యాటక రంగ పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరుగుతుండేది. హిందీ, తెలుగు, తమిళం పరిశ్రమలను కశ్మీర్‌ వరకు తీసుకెళ్లాలి. కొత్త పరిశ్రమలు, కొత్త వ్యవస్థల ఏర్పాటులో ప్రైవేటు సంస్థలు ప్రాధాన్యమివ్వాలి" అంటూ అభిలాష్ అవ్యక్తం చేశారు.