కాశ్మీర్ పై కేంద్రం చర్యకు కరణ్‌ సింగ్ మద్దతు

జమ్ముకశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా ఖండించాల్సిన పనిలేదని కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి కరణ్‌ సింగ్ స్పష్టం చేశారు. వాటిపై రాష్ట్ర ప్రజలతో విస్త్రతంగా చర్చలు జరపాలని, వెంటనే రాష్ట్రంలో సాధారణ స్థితిని పునరుద్ధరించాలని సూచించారు. అలాగే ఇప్పటికే అరెస్టు చేసిన రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జమ్ముకశ్మీర్ చివరి రాజు హరిసింగ్ తనయుడే ఈ కరణ్‌ సింగ్.  

కాగా, ‘దేశ వ్యతిరేకత నెపంతో రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల నాయకులను అదుపులోకి తీసుకోవడం సరైంది కాదు. ఆ పార్టీ కార్యకర్తలు సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేశారు. ఎప్పటికప్పుడు ఆ పార్టీలు జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూనే ఉన్నాయి.  ఆ రాజకీయ పార్టీల నాయకులను వెంటనే విడుదల చేయాలి’ అని సింగ్ తన ప్రకటనలో అభ్యర్థించారు.

 అలాగే పార్లమెంటు ఆమోదం పొందిన పునర్విభజన బిల్లులోని లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రతిపాదనను సింగ్ ఆహ్వానించారు. 1965లోనే తాను ఈ ప్రతిపాదన చేసిన్నట్లు చెప్పారు. ఆర్టికల్ 35 ఏ రద్దుకు మద్దతు ఇస్తూనే..లింగ వివక్షను పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. జమ్ము, కశ్మీర్ మధ్య రాజకీయ అధికారాలను పునర్విభజన బిల్లు సరైన రీతిలో విభజిస్తుందని సమర్ధించారు.

జమ్ముకశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ ఖండించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  అన్ని వర్గాల ప్రజల సంక్షేమం గురించే తాను ప్రధానంగా ఆలోచిస్తానని సింగ్ తెలిపారు.