`ఆర్టికల్‌ 370’పై అత్యవసర విచారణకు సుప్రీం తిరస్కారం

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై అత్యవసర విచారణ జరపాలంటూ ప్రముఖ న్యాయవాది ఎంఎల్‌ శర్మ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అత్యవసర విచారణకు జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తగిన సమయంలో విచారిస్తుందని జస్టిస్‌ రమణ స్పష్టం చేశారు. 

మరోవైపు ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు, మాజీ సీఎంల నిర్బంధాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్త తహ్‌సీన్‌ పూనావాలా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం ఆంక్షలు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని తహసీన్‌ ఆరోపించారు.

జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలు ఉపసంహరించాలని, మొబైల్‌ ఇంటర్నెట్‌, మీడియా ఛానళ్ల ప్రసారం, ఫోన్‌ లైన్లను వెంటనే పునరుద్ధరించాలని తన పిటిషన్‌లో కోరారు. అంతేగాక.. నిర్బంధంలో ఉన్న మాజీ సీఎంలు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఇతర రాజకీయ నాయకులను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కోరగా.. ధర్మాసనం తిరస్కరించింది. 

కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఆదివారం నుంచే కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో నిషేధాజ్ఞలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందే మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా సహా కొందరు రాజకీయ నాయకులను గృహనిర్బంధం చేశారు. గత సోమవారం నుంచి వీరు నిర్బంధంలోనే ఉన్నారు. అయితే వచ్చే వారం బక్రీద్‌ పండగ నేపథ్యంలో ఈ నిషేధాజ్ఞలను కాస్త సడలించాలనే యోచనలో ఉన్నట్లు నిన్న కొన్ని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.