రూపాయి పతనంతో భారీగా రాష్ట్రాలకు ఆదాయం

ఓవైపు రూపాయి రోజురోజుకూ పతనమవుతుండటం, పెట్రో ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు విలవిల లాడుతూ ఉంటె రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అనుకోకుండా భారీ ఆదాయాలు సమకురుతూ ఉండడంతో పండుగ చేసుకొంటున్నాయి. తమకు అయాచితంగా లభిస్తున్న అదనపు ఆదాయంలో ఒక్క రూపాయిని కుడా ప్రజలకు పంచాలని మాత్రం పొరపాటున కూడా అనుకోవడం లేదు.

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతూ ఉండడంతో రాష్ర్టాల పన్ను ఆదాయం భారీగా పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టాలకు అదనంగా రూ.22,700 కోట్ల రాబడి వచ్చింది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి పెట్రో ధరలు పెరిగితే వాటిపై వచ్చే పన్ను ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. ఇలా ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.22,700 కోట్లు అదనంగా రాష్ర్టాల ఖాతాల్లో చేరినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ వెల్లడించింది.

బ్యారెల్ ముడి చమురు ధర ఒక డాలర్ పెరిగితే 19 ప్రధాన రాష్ర్టాల ఆదాయం రూ.1,513 కోట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ధరలు పెరగడం వల్ల అత్యధికంగా మహారాష్ట్రకు రూ.3,389 కోట్ల అదనపు ఆదాయం రాగా, తర్వాతి స్థానంలో రూ.2,842 కోట్లతో గుజరాత్ ఉంది. ఢిల్లీలో మార్చి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ లీటర్‌కు రూ.5.6, డీజిల్‌పై రూ.6.31 పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా పెట్రోల్ ధర రూ.89కి చేరడం విశేషం.

మహారాష్ట్ర అత్యధికంగా 39.12 శాతం వ్యాట్ విధిస్తుండగా, గోవా అత్యల్పంగా 16.66 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నది. ఈ ఆకస్మిక ఆదాయంతో రాష్ర్టాల ద్రవ్యలోటు 15 నుంచి 20 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు ఎస్‌బీఐ అంచనా వేసింది.