కలకలం రేపుతున్న డాక్టర్ శిల్ప ఆత్మహత్య

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా మెడికల్ కళాశాల పీడియాట్రిక్ పీజీ విద్యార్థిని లైంగిక వేధింపుల కారణంగా డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. శిల్ప మృతికి ప్రొఫెసర్ల వేధింపులే కారణమని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ పీజీ మెడికల్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

ఎస్వీఎమ్‌సీ అనుబంధ ఆస్పత్రి అయిన ఎస్వీఆర్ రుయాలో వివాదం మరింత ముదిరింది. ఎస్వీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమణయ్యను బాధ్యతల నుంచి తప్పిస్తూ డీఎంఈ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వ డాక్టర్ల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర డాక్టర్ల సంఘం నాయకులు ఆస్పత్రిలో విధులను బహిష్కరించి రుయా సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ శిల్ప లైంగింక వేధింపుల ఫిర్యాదుపై జరిగిన విచారణకు సంబంధించిన నివేదిక బయటకు రాకపోవడానికి రమణయ్యకు సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ డాక్టర్ల సంఘం అంటోంది.

మరోవైపు శిల్ప ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సీఐడీ చీఫ్ అమిత్ గార్గ్ ఈ కేసు సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించనున్న సిట్ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.