పాకిస్తాన్ దూకుడుకు అమెరికా హెచ్చరిక

ఆర్టికల్‌ 370ని భారత్‌ రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్ చూపిస్తున్న అత్యుత్సాహంపై అమెరికా స్పందించింది. ఈ విషయంలో పాక్‌కు మొట్టికాయలు వేసింది. ఇరు దేశాల వైఖరిని గమనిస్తున్నామని తెలిపింది. భారత్‌తో వాణిజ్యం రద్దు, దౌత్య సంబంధాలను కనిష్ఠ స్థాయికి చేర్చడం, హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా బహిష్కరణ తదితర అంశాలపై అమెరికా స్పందించింది.

‘జమ్ముకశ్మీర్‌లో పరిపాలన, కేంద్ర పాలిత ప్రాంతాలు తదితర అంశాలపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా గమనిస్తోంది. ఆయా అంశాల్లో చోటు చేసుకుంటున్న పురోగతులను మేం చూస్తూనే ఉన్నాం. పాకిస్థాన్‌ తన దూకుడును తగ్గించుకోవాలి. ఎల్‌ఓసీలో అక్రమ చొరబాట్లకు మద్దతివ్వడం ఆపేయాలి. పాకిస్థాన్‌ గడ్డమీద ఉగ్రవాద మూలాలపై  చర్యలు తీసుకోవాలి’ అని అమెరికా తెలిపింది. 

ఇదే అంశంపై సంయమనం పాటించాలని పాకిస్తాన్‌ను కోరింది. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై భారత్‌ తమకు సమాచారం ఇవ్వలేదన్న అమెరికా ఆ తర్వాత కొద్దిసేపటికే జమ్మూ కశ్మీర్‌ పరిణామాలపై స్పందించింది. భారత్‌తో వాణిజ్య సంబంధాలకు స్వస్తి పలకడంతో పాటు దౌత్యపరమైన చర్యలతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం దూకుడు పెంచడంతో సంయమనం పాటించాలని అగ్రరాజ్యం సూచించింది.

కాగా, జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలన్న భారత్‌ నిర్ణయం నేపథ్యంలో పాకిస్తాన్‌ ఎలాంటి ప్రతిచర్యలకు పాల్పడరాదని, వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లను ప్రోత్సహించడం వంటి చర్యలను మానుకోవాలని స్పష్టం చేసింది. తమ భూభూగంలోని ఉగ్రవాదులు, ఉగ్ర శిబిరాలపై చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ ప్రతినిధి పాకిస్తాన్‌ను  కోరారు.