ఆర్టికల్ 370లోని నిబంధనలు ఇక చెల్లుబాటు కాబోవు

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370లోని నిబంధనలు ఇక చెల్లుబాటు కాబోవని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన తీర్మానానికి పార్లమెంట్ ఉభయసభలు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ మేరకు రాష్ట్రపతి సంతకంతో కూడిన ఒక ప్రకటన వెలువడింది. 

ఆర్టికల్ 370లోని క్లాజ్ (3) ద్వారా దఖలుపడిన అధికారాలను అనుసరించి పార్లమెంట్ సిఫార్సు మేరకు 2019 ఆగస్టు 6 నుంచి ఆర్టికల్ 370లోని అన్ని నిబంధనలు ఇకపై చెల్లుబాటు కాబోవని రాష్ట్రపతి ప్రకటించారు అని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అలాగే, రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు, సమయానుసారం చేసే సవరణలు, ఎలాంటి మార్పులు, మినహాయింపులు లేకుండా జమ్ముకశ్మీర్‌కు వర్తిస్తాయని వివరించారు. 

ఆర్టికల్ 152 లేదా ఆర్టికల్ 308 లేదా రాజ్యాంగంలోని ఏ ఇతర ఆర్టికల్ అయినా లేదా జమ్ముకశ్మీర్ రాజ్యాంగంలోని ఏ ఇతర నిబంధనలు లేదా ఏ ఇతర చట్టం, పత్రం, తీర్పు, ఆర్డినెన్స్, ఆదేశం, నిబంధన, నియంత్రణ, నోటిఫికేషన్, లేదా ఏ ఇతర ఒప్పందాలు కూడా దీనికి అడ్డంకి కాబోవు అని అందులో వివరించారు.

ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు జమ్ముకశ్మీర్ రాష్ర్టాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన తీర్మానం, బిల్లుకు పార్లమెంట్ మంగళవారం ఆమోదముద్ర వేసిన విషయమూ విదితమే.