బలమైన నాయకుడిగా సత్తా చాటిన అమిత్ షా

బీజేపీలో అత్యంత విజయవంతమయిన పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటికే అవతరించిన అమిత్ షా ఇప్పుడు దేశ రాజకీయ చిత్రపటంలో ప్రత్యేకించి తన స్వంత పార్టీ, హిందూత్వ పక్షాల్లో బలోపేతమయిన నాయకుడిగా మారారు. అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేస్తామని బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఆయన ఈ స్థితికి చేరారు. 

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సంవత్సరం మే 30వ తేదీన రెండోసారి అధికారం చేపట్టిన తరువాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన పనుల్లో జమ్మూకాశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తిని తొలగించిన ప్రక్రియ హైలైట్‌గా నిలిచిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను పటిష్టం చేసే బిల్లులకు ఆమోదం పొందడం వల్ల అమిత్ షా ప్రతిష్ట పెరగడంతో పాటు హిందూత్వ, జాతీయ భద్రత అనే రెండు అంశాలలో ఆయన ప్రతిపక్షాలను సహితం ఇరకాటంలో పడవేశారు. 

భారత్‌లో జమ్మూకాశ్మీర్‌ను సమగ్రంగా విలీనం చేయాలనే అంశంపైనే పోరాడుతూ బీజేపీకి పూర్వ రూపమయిన ఆనాటి జన్‌సంఘ్ సిద్ధాంతకర్త శ్యామప్రసాద్ ముఖర్జీ 1953లో జమ్మూకాశ్మీర్ జైలులో మృతి చెందారు. అలాంటి కీలకమయిన లక్ష్యాన్ని సాఫల్యం చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరువాత ఘనతను దక్కించుకున్నది అమిత్ షాయే. అందుకే బీజేపీ నాయకులు పార్లమెంటులో అమిత్ షాను ఎంతగానో కీర్తించారు. కొందరయితే దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్‌లో అమిత్ షాను పోల్చారు. 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి ఎన్డీయేతర పక్షాలు కూడా అమిత్ షాను పొగడ్తలతో ముంచెత్తడానికి వెనుకాడలేదు. బీజేపీ నాయకత్వ స్థాయిలో కొనసాగుతూ ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసిన ఘనత అమిత్ షాదేనని చెప్పవచ్చు. ఈ కారణంగా ప్రభుత్వం బీజేడీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, బీఎస్‌పీ, టిడిపి వంటి ఎన్‌డీయేతర పక్షాల మద్దతును పొందటం ద్వారా ప్రతిపక్షాల ఐక్యతను భగ్నం చేయగలిగింది. 

చతురుడయిన రాజకీయ వ్యూహకర్త అయిన అమిత్ షా జమ్మూకాశ్మీర్‌పై చేసిన తీర్మానాలు, బిల్లులపై చర్చను జాతీయ భద్రత, ఐక్యత చుట్టూ తిప్పడం వల్ల బీజేపీకి బద్ధ శత్రువయిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా చివరకు అధికార పక్షానికి మద్దతు ఇచ్చింది.