సిబిఐ విచారణకు సిద్దమా బాబు.. కన్నా సవాల్

భోగాపురం విమానాశ్రయం టెండర్ల రద్దుపై సీబీఐ విచారణకు సిద్ధమా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. ప్రతి వారం ముఖ్యమంత్రికి ఇదు ప్రశ్నలతో బహిరంగ లేఖ రాస్తున్న కన్నా ఈరోజు తన 11వ లేఖను విడుదల చేశారు. ఎయిర్ పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా మొదట నిర్వహించిన టెండర్ దక్కించుకుంటే దాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేవలం ప్రైవేటు సంస్థలకు లబ్ది చేకూర్చేందుకే మొదటి టెండర్ రద్దు చేశారని మాజీ మంత్రి ఆరోపించారు.

బీద రాష్ట్రమని, కట్టుబట్టలతో పంపారని నిత్యం కద్దలు చెబుతున్న ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని ఆర్భాటాల కోసం పప్పు, బెల్లలా ఖర్చు చేయడం లేదా అంటూ కన్నా నిలదీసారు. నరసరావుపేట లో రెండు గంటల కార్యక్రమానికి రూ 45 లక్షల ఖర్చా అంటూ విస్మయం వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఆడిటోరియాలు ఉన్నా వాటిని పక్కన బెట్టి ప్రైవేటు ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ సంస్థలకు డబ్బులు దోచిపెడుతున్నారని విమర్శించారు.

నాగార్జున యూనివర్సిటీలో బ్రహ్మాండమైన కన్వెన్షన్ సెంటర్ ఉంటె, దానిని కాదని కూతవేటు దూరంలోని ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ లో లక్షల రూపాయాలు ఖర్చు పెట్టి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఇంతకన్నా దుర్మార్గమైన దుబార మరెక్కడైనా ఉన్నదా అని దయ్యబట్టారు. గత నాలుగేళ్లలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలకు ఎంత చెల్లించారో చెప్పాలని కన్నా నిలదీశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగుకు రూ 11 వేలు చెల్లించి , వందల కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయం భవనాలలో రెండు రోజుల వర్షాలకే లీక్ కావాలా అంటూ విస్మయం వ్యక్తం చేసారు. ఈ నిర్మాణాల అవినీతిపై విచారణ ఎందుకు జరిపించారని అడుగుతూ ముడుపులు ముట్టడం వల్లనే గదా అని ఎద్దేవా చేసారు. ఇంత అవమానకరం విషయం మీకు సిగ్గుగా లేదా అంటూ ఈ మొత్తం ఉదంతంపై సిబిఐ విచారణకు సిద్దమా ఆని నిలదీశారు.

టిడిపి పరిపాలనలో మహిళా ఉద్యోగులపై దాడులు పెరిగిపోయాయని కన్నా ఆందోళన వ్యక్తం చేసారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మీ పరిపాలనలో మహిళా ఉద్యోగులపై జరుగుతున్నా లైంగిక దాడులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అంటూ స్వర్ణాంధ్ర ప్రదేశ్ తీసుకు వస్తామని చెప్పి లైంగిక ఆంధ్ర ప్రదేశ్ తీసుకు వచ్చారా అని మండిపడ్డారు.

వనజాక్షి వంటి మహిళా అధికారిపై మీ ఎమ్యెల్యే దాడి చేసినప్పుడే తగు చర్య తీసుకొని ఉంటె ఇప్పుడు మహిళా ఉద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో ఇంత దుర్భర స్థితిలో ఉండేదా అని ప్రశ్నించారు. సెలవులు కావాలన్న, బదిలీ కావాలన్న, ప్రమోషన్ కావాలన్న లైంగిక దాడి తప్పని సారి కావడం మీ పరిపాలన వైఫల్యం కాదా చంద్రబాబు అని కన్నా దయ్యబట్టారు. ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం మీకు లేదా అని అడుగుతూ ఇంత అసమర్ధ ప్రభుత్వం ఒక క్షణం కుడా అధికారంలో కొనసాగే అధికారం లేదని స్పష్టం చేసారు.

ఏపీఎన్ఆర్టీ సీఈవోగా అమెరికా పౌరసత్వం ఉన్న వేమూరి రవిని నియమించారని అంటూ అందులో అక్రమాలు జరిగితే ఆయన్ని మన చట్టాల ప్రకారం శిక్షించలేమని లేఖలో పేర్కొన్నారు.