ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేతపై తీర్పు రిజర్వు!

తెలంగాణలో కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేత కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. గత నెల రోజులుగా పలు దఫాలుగా కొనసాగిన వాదనలను విన్న ఉన్నత న్యాయస్థానం దీనిపై తీర్పును రిజర్వులో ఉంచింది. 

2010లో హెచ్‌ఎండీఏ సమర్పించిన మాస్టర్‌ ప్లాన్‌లో ఎర్రమంజిల్‌ పురాతన కట్టడంగా ఉందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రెగ్యులేషన్‌ 13 రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 183 చట్టవిరుద్ధమని తెలిపారు. చారిత్రక కట్టడాల జాబితాను రద్దుచేస్తూ ప్రభుత్వం 183 జీవో ఇచ్చింది. 

ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేతపై జులై 3 నుంచి హైకోర్టులో పలు దఫాలుగా వాదనలు కొనసాగగా.. పిటిషనర్ల తరఫు న్యాయవాది మాత్రం భవనాల కూల్చివేతసి కొత్త భవనం నిర్మించడానికి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కొత్త భవనం నిర్మిస్తే ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతో పాటు పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను విస్మరించినట్టవుతుందని పేర్కొంటూ వచ్చారు. 

పురాతన ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేసి కొత్త అసెంబ్లీ భవనం నిర్మించడం సరైంది కాదని వారు వాదించారు. ఇందుకు సంబంధించి పలు రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సైతం ప్రస్తావించారు. అసంబద్ధంగా 183 జీవో తీసుకొచ్చారని వాదించారు.

తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం గనక కొత్త భవనాలు నిర్మించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఉన్న  అసెంబ్లీ భవనం అసెంబ్లీ కోసం నిర్మించిన భవనం కాదని.. సుమారు 100 ఏళ్ల క్రితం నిర్మించిన హాలును అసెంబ్లీ కోసం వినియోగిస్తున్నామన్నారు. 

రాష్ట్ర అవసరాల దృష్ట్యా అధునాతనంగా అసెంబ్లీ భవనం నిర్మించాలని భావించడం వల్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని.. ఇందులో భాగంగానే ఎర్రమంజిల్‌లో నూతన భవనాల నిర్మాణం చేపట్టిందని వాదించారు. ప్రభుత్వం తీసుకొనే ఆర్థిక సంబంధమైన నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోరాదనే పలు తీర్పులను అదనపు ఏజీ హైకోర్టు ముందు ఉంచారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.