సుష్మా భౌతికకాయం వద్ద భోరున విలపించిన అడ్వాణీ

సుష్మాస్వరాజ్ మృతితో దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని బీజేపీ అగ్రనేత ఎల్‌కె అడ్వాణీ ఓ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నానని అన్నారు. సుష్మ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని సుష్మా భౌతికకాయం వద్ద అడ్వాణీ భోరున విలపించారు. ఆయన విలపించిన తీరు చూసి అక్కడున్న వారు కంటతడి పెట్టారు. అడ్వాణీ కుమార్తె ప్రతిభా కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఎల్‌కే అడ్వాణీ, ఆయన కుమార్తె ప్రతిభా అడ్వాణీ సుష్మా భర్తను, కుమార్తెను ఓదార్చారు.

సుష్మా స్వరాజ్ ఇక లేరన్న విషయం తెలిసిన తర్వాత అడ్వాణీ భావోద్వేగంతో కూడిన లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో సుష్మాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 'నాకు అత్యంత ఆప్తురాలైన సుష్మాజీ ఇక లేరని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాను. బీజేపీతో తొలినాళ్ల నుంచి మమేకమవుతూ ఎంతో ప్రతిభావంతురాలిగా సుష్మ పేరుతెచ్చుకున్నారు. 80వ దశకంలో నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా టీమ్‌లో ఎంతో చురుకుగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవడం నాకింకా గుర్తుంది. ఆ తర్వాత అంచలంచెలుగా ఆమె బీజేపీలో అత్యంత ఆదరణ కలిగిన నాయకురాలిగా ఎదిగారు' అని గుర్తు చేసుకున్నారు.

ఆమె చాలా గొప్ప వక్త. ఆమెకున్న జ్ఞాపక శక్తి, ఆయా విషయాలను సందర్భానుసారంగా ఆమె ఎంతో స్పష్టంగా వివరించి చెబుతున్నప్పుడు ఆమె ప్రతిభ చూసి ఎంతో అబ్బురపడేవాడిని అంటూ అడ్వాణీ పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్ ఒక గొప్ప మానవతావాదని, ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అందరితో మమేకమయ్యేవారని అడ్వాణీ కొనియాడారు.

ఏటా తన పుట్టినరోజుకు తనకెంతో ఇష్టమైన చాకొలెట్ కేక్ సుష్మ తీసుకువచ్చేవారని, ఒక్క ఏడాది కూడా ఆమె అలా చేయకపోవడం తనకు గుర్తుకులేదని చెప్పారు. సుష్మాస్వరాజ్ హఠాన్మరణంతో దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందన్నారు. వ్యక్తిగతంగా ఆమె మృతి తనను కలిచివేసిందని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అడ్వాణీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.