సుష్మా స్వరాజ్ కన్నుమూత

బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు. గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. 

సోషల్ మీడియా వేదిక ద్వారా సుష్మా స్వరాజ్ విశేష అభిమానులను కలిగి ఉన్నారు. ఆమె చివరిసారిగా కశ్మీర్ విభజనపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన జీవితకాలంలో ఇటువంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగానే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ పోటీ చేయని విషయం తెలిసిందే. 

సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఢిల్లీ ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 

1977లో 25 ఏళ్ల పిన్న వయసులోనే హరియాణా కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 27 ఏళ్ల వయసులో హరియాణా జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1990 ఏప్రిల్ లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు. 

1996లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో దిల్లీలోని హాజ్‌ ఖాస్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.1998 అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 3 వరకు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 

1996లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం కేవలం 13 రోజులపాటు కొనసాగిన సమయంలో సుష్మ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ఉన్నారు. లోక్‌సభలో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని అప్పట్లో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.  

మళ్లీ 2000 సెప్టెంబర్‌ 30 నుంచి 2003 జనవరి 29 మధ్య కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర ఆరోగ్యం - కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

2009 జూన్‌ 3న లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ ఉప నేతగా బాధ్యతలు చేపట్టారు. ఆపై లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేతగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనత సొంతం చేసుకున్నారు. 2014 మే 26 నుంచి 2019 మే 30 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన మహిళ సుష్మే.  బిజెపి అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటరీ బోర్డు సభ్యురాలిగా పార్టీలో విశేష సేవలు అందించారు. 

క్రిమినల్‌ న్యాయవాది స్వరాజ్‌ కౌశల్‌ను 1975 జులై 13న సుష్మ వివాహమాడారు. రాజకీయాల్లో రాణించేలా ఆయన సుష్మకు పూర్తి ప్రోత్సాహం అందించారు. 1990-93 మధ్య మిజోరం గవర్నర్‌గా కౌశల్‌ పనిచేశారు. మనదేశంలో అతి పిన్న వయసులో గవర్నర్‌ పదవిని చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. 1998-2004 మధ్య కౌశల్‌ ఎంపీగా కూడా ఉన్నారు. సుష్మ-కౌశల్‌ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమె పేరు బన్సూరీ కౌశల్‌. బన్సూరీ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు.