కాపు బిల్లును వాపసు తీసుకోవాలి : ముద్రగడ

కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన కాపుల రిజర్వేషన్ల బిల్లును వాపసు తీసుకోవాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తిచేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల కోసం బీసీ రిజర్వేషన్ బిల్లును కొన్ని సవరణలతో కొత్తగా తయారుచేసి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రికి వ్రాసిన ఒక బహిరంగ లేఖలో  కోరారు. రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో కాపులకు బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టం చేయాలని విజ్ఞప్తిచేశారు.

బిల్లును చట్టరూపంలోకి తెచ్చిన వెంటనే జీవో ఇచ్చి తహశీల్దారు కార్యాలయాల్లో కాపులకు బీసీ-ఎఫ్ సర్ట్ఫికెట్లు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాపుల రిజర్వేషన్ బిల్లు 33/2017లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందని న్యాయవాదులు చెబుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి అభ్యంతరం లేని పక్షంలో తనకు న్యాయ సలహాలిచ్చిన న్యాయవాదులచే బిల్లు తయారుచేయిస్తామని, అనంతరం ప్రభుత్వం అనుకూలమైన మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని సూచించారు.

కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇప్పటికైనా అమలుచేసి ఈ సమస్యకు శుభం కార్డు వేయాలని ముద్రగడ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు. కాపులకు బీసీ రిజర్వేషన్లను ముందుగా రాష్ట్రంలో అమలుచేసి, తర్వాత కేంద్ర సర్వీసుల గురించి ఆలోచించాలని సూచించారు.  కాపులకు బీసీ రిజర్వేషన్ల విషయంలో పెడర్ధాలు తీయకుండా తక్షణం అసెంబ్లీలో సవరించిన బిల్లు ప్రవేశపెట్టి అమలుచేసేందుకు కృషి చేయాలని ముద్రగడ కోరారు.

కాగా, బెదిరింపులు, ప్రలోభాలతో రిజర్వేషన్లు సాధించలేరన్న విషయాన్ని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు హితవుపలికారు. కేంద్ర ఆమోదానికి పంపిన కాపు రిజర్వేషన్ బిల్లును వెనక్కు తెప్పించి రిజర్వేషన్లను 5 నుండి 10 శాతానికి పెంచి బీసీ-ఎఫ్‌గా చేర్చి, బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేసి త్వరలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో కాపులకు ఉద్యోగాలు కల్పించాలని ముద్రగడ తాజాగా సీఎం చంద్రబాబును చేసిన సూచనను ప్రస్తావించారు.

అలా చేయకపోతే రాజకీయ గుణపాఠం చెబుతామని హెచ్చరించారని, తాను చెప్పిన విధంగా చేస్తే లక్ష మందితో ఊరేగింపు జరిపి సన్మానం కూడా చేస్తామని చెప్పారని పేర్కొంటూ అయితే మొదటిది బెదిరింపు, రెండోది ప్రలోభం అవుతుందే తప్ప మరొకటి కాదని విమరిస్న్చారు. రాష్ట్రప్రభుత్వం, కాపు నాయకులు కలిసి అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని పంపించిన అభ్యర్థనను కేంద్రం ఎందుకు ఆమోదించలేదో ఇప్పుడు వారే చెప్పాలని డిమాండ్ చేసారు.

కాపు రిజర్వేషన్లను కాపాడతామన్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అయినా చెప్పవచ్చని ఎద్దేవా చేసారు. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్‌ను మించి రిజర్వేషన్లు కల్పించే అధికారం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసారు. ఓ పక్క చంద్రబాబు, మరో పక్క ముద్రగడ కాపులను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని, కాపులు వీరి మాయలో పడవద్దని శంకరరావు సూచించారు.