కశ్మీరు విభజనకు సింధియా మద్దతు- ఖంగుతిన్న కాంగ్రెస్

కాంగ్రెస్ యువ నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా జమ్మూ-కశ్మీరు విభజనకు మద్దతు పలికారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు కల్పించిన అధికరణ 370 రద్దును స్వాగతించారు. దీంతో ఈ అంశంపై ఆ పార్టీలో ఏకాభిప్రాయం లేదని స్పష్టమవుతోంది.

మంగళవారం సింథియా ఇచ్చిన ఓ ట్వీట్‌లో జమ్మూ-కశ్మీరు, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడానికి రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.

"జమ్మూ-కశ్మీరు, లడఖ్‌లపై చర్యను, దీనిని భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేయడాన్ని నేను సమర్థిస్తున్నాను. రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి ఉంటే బాగుండేది. అప్పుడు ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నమై ఉండేవి కాదు. అయినప్పటికీ, ఇది మన దేశ ప్రయోజనాల కోసమే, నేను దీనిని సమర్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

అధికరణ 370 రద్దుపై సొంత పార్టీ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడిన తొలి కాంగ్రెస్ నేత జనార్దన్ ద్వివేది. ఆయన గాంధీ కుటుంబానికి విధేయుడు. ఆయన మాట్లాడుతూ తన గురువు రామ్ మనోహర్ లోహియా మొదటి నుంచి అధికరణ 370కి వ్యతిరేకమని చెప్పారు. ఇది జాతీయ సంతృప్తికి సంబంధించిన విషయమని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నానన్నారు. స్వాతంత్ర్యం వచ్చినపుడు జరిగిన పొరపాటును ఇప్పుడు సరిదిద్దుతున్నారన్నారు. ఆలస్యంగానైనా సరిదిద్దడం మంచిదేనన్నారు.

రాహుల్ గాంధీ బృందంలో సభ్యుడు , హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడా కుమారుడు దీపేందర్ హుడా 21వ శతాబ్దంలో అధికరణ 370 అవసరం లేదన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు.