పరిస్థితులు సద్దుమణిగాక పీవోకేలో ఎన్నికలు

జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగాక పీవోకేలోని 25 స్థానాలకు ఎన్నికలు ఉంటాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. కశ్మీర్‌లో బలగాలను ఉపసంహరించబోమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

జరిగిన చర్చకు అమిత్ షా ఇచ్చిన సమాధానం తర్వాత జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు మద్దతుగా 367 ఓట్లు వచ్చాయి. 67 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ బిల్లు రాజ్యసభలో నిన్ననే ఆమోదం పొందింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్‌సభ ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 351 మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. ఒకరు గైర్హాజరయ్యారు.

నెహ్రూ విధానం వల్లే పీవోకే భారత్‌ నుంచి వెళ్లిపోయిందని.. 1948లో భారత సేనలు పాక్‌ ఆర్మీని తరుముకుంటూ బాలాకోట్‌ వరకూ వెళ్లాయన్నారు. ఇంతలోనే నెహ్రూ మన సేనలను వెనక్కి పిలిపించారని.. అందుకే పీవోకే మనకు కాకుండా పోయిందని ఈ సందర్భంగా  గత ప్రభుత్వంపై షా కన్నెర్రజేశారు. ఎవరినీ సంప్రదించకుండానే ఆకాశవాణి ద్వారా ఆర్టికల్‌ 35ని నెహ్రూ ప్రకటించారని ధ్వజమెత్తారు. 

ఈ సందర్భంగా ఏపీ, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు గురించి మాట్లాడిన ఆయన.. ఆయా రాష్ట్రాలకు ఎలాంటి భయం అక్కర్లేదని అమిత్‌షా చెప్పుకొచ్చారు.  జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం కనీసం ఎవరితోనూ సంప్రదింపులు జరపడంలేదంటూ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందించారు. మూడు తరాలుగా దీనిపై చర్చలు జరుగుతున్నా కనీసం పరిష్కారం కనిపెట్టలేదనీ.. ఇంకా దీనిపై మాట్లాడి ప్రయోజనం ఏమిటంటూ కౌంటర్ ఇచ్చారు. 

"ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా చారిత్రక తప్పు చేశారంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అంటున్నారు. మేం ఆ తప్పును సరిచేశామనే అంశం భావితరాలకు తెలుస్తుంది. వచ్చే ఐదేళ్లలో జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధిని చూస్తారు. ఆర్టికల్‌ 370 వల్ల జరిగిన నష్టాలు కశ్మీర్‌ ప్రజలకు అర్థమవుతాయి. ఆర్టికల్‌ 370 వల్ల ఎంత నష్టపోయారో కశ్మీర్‌ ప్రజలు అర్థం చేసుకుంటారు" అని అమిత్ షా చెప్పారు.  

ఆర్టికల్‌ 370 రద్దు మంచిదా? కాదా? అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుందని పేర్కొంటూ అధికరణం 370ని అధికరణం 371తో పోల్చడం సరికాదని స్పష్టం చేశారు. ఈ రెండు అధికరణలను పోల్చడం ద్వారా కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.  ఆర్టికల్‌ 371ని ఎత్తివేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చేశారు. కశ్మీర్‌లో మైనార్టీలంటే హిందువులు, సిక్కులు, జైనులని వివరణ ఇచ్చారు.   

జమ్మూకశ్మీర్‌కు కేంద్రం ఇస్తున్న నిధులన్నీ ఏమవుతున్నాయి? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులతో కశ్మీర్‌ గ్రామాల్లో ఎలాంటి మార్పూ రాలేదని, ఎలాంటి మౌలిక వసతులూ కల్పించలేదని ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీర్‌ ప్రజల్ని పేదరికంలో ఉంచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.  మూడు కుటుంబాలకే ఆర్టికల్‌ 370 రక్షణగా నిలిచిందని చెబుతూ  370 రద్దుతో అందరికీ రక్షణ లభించిందని భరోసా ఇచ్చారు.