ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్న జగన్ పార్లమెంట్‌ కార్యాలయానికి వెళ్లి ప్రధానితో సమావేశమయ్యారు. ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది. సీఎం జగన్‌ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు. 

కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో భేటీ అనంతరం మోదీ నేరుగా సభకు హాజరయ్యారు. రాష్ట్రాభివృద్ధికి ఆర్థికి సాయం చేయాల్సిందిగా సీఎం జగన్‌ ప్రధానిని కోరినట్టు తెలిసింది.  ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని మోదీని కోరినట్టు సమాచారం. విభజన హామీలు అమలు చేయాలని, ఏపీని ఆర్థిక గండం నుంచి గట్టెక్కించాలని ప్రధానిని కోరారు.

గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల టెండర్లను సమీక్షించి రివర్స్ టెండరింగ్‌కు ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు ప్రధాని మోదీకి జగన్ వివరించారు. పోలవరం జలవిద్యుత్ కేంద్రాల రివర్స్ టెండరింగ్ విధానం ఆలోచన చేసినట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పాలన వేగాన్ని పెంచేందుకు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది.. తమను గట్టెక్కించాలని ప్రధానిని కోరారు. 

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయమే అజెండాగా సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు దిల్లీ చేరుకున్నారు. తొలుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ.. ఆర్టికల్‌ 370 రద్దుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన బిజీగా ఉన్నారు. దీంతో  ప్రధాని కార్యాలయానికి చేరుకొని పీఎంవో కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, అదనపు కార్యదర్శి పీకే శర్మతో భేటీ అయ్యారు.   

మిశ్రాతో జగన్ బృందం 40 నిముషాలపాటు సమావేశమైంది.  రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, విభజన అంశాలు, ప్రత్యేకంగా ఏపీకి ఆర్థిక సాయంపై వారితో చర్చించినట్టు తెలుస్తున్నది.  ప్రధానితో భేటీలో నివేదించాల్సిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పోలవరం కాంట్రాక్టుల రద్దు, పీపీఏల రద్దుతో పాటు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనే అంశంపైనా అధికారులతో చర్చించినట్టు సమాచారం.   

ఇక జగన్ బృందం బుధవారం హోంమంత్రి అమిత్ షాను కలవనుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కూడా భేటీ కానుంది.