అఫ్రిది వ్యాఖ్యలను తిప్పికొట్టిన గంభీర్‌

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ.. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది చేసిన ట్వీట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ మండిపడ్డారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న అఫ్రిది వ్యాఖ్యలను గంభీర్‌ తనదైన శైలిలో తిప్పికొట్టారు.

 ‘ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. స్వేచ్చ విషయంలో అందరికీ సమాన హక్కులు వర్తిస్తాయి. ఇంత జరుగుతున్నా ఐరాస ఎందుకలా నిద్రపోతోంది. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఎందుకు స్పందించట్లేదు. అసలు ఐరాస‌ను ఎందుకు ఏర్పాటు చేశారు? కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని అఫ్రిది ట్వీట్‌ చేశాడు.

దీనిపై గంభీర్‌ స్పందిస్తూ..‘అఫ్రిది ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది వాస్తవమే. ఈ విషయాన్ని తెలిపిన నిన్ను అభినందించాల్సిందే. కానీ నువ్వు మరిచిపోయిన విషయం ఏంటంటే.. ఇవన్నీ పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో జరుగుతున్నాయని ప్రస్తావించకపోవడం. ఏం బాధపడకు త్వరలో పీఓకే పరిస్థితులను కూడా పరిష్కరిస్తాం.’ అంటూ అఫ్రిదికి గంభీర్‌ చురకలింటించారు.

ఇక ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు వాదులాడుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా కశ్మీర్‌ విషయంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. మైదానంలో కూడా ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి.