పార్టీ వైఖరిపై కాంగ్రెస్‌లో నిరసన గళం

జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణం 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే కొంత మంది సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టడం గమనార్హం. కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించారు. దేశంలో సమగ్రత కోసం, జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి కోసం అధికరణ 370ని రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 

సీనియర్‌ కాంగ్రెస్ నేత జనార్దన్‌ ద్వివేది మాట్లాడుతూ.. ఒక చారిత్రక తప్పిదాన్ని కేంద్రం సరిచేసిందని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు ఇంతటితో ముగింపు లభించిందని అభిప్రాయపడ్డారు. ఆలస్యమైనప్పటికీ.. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. 

మరో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ దీపేందర్‌ హూడా సైతం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు.  దేశంతో పాటు జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ఈ నిర్ణయంతో ఎంతో మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దంలో ఇంకా అధికరణ 370 చెల్లుబాటు కావడం సమంజసం కాదన్నారు. 

అలాగే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ సదర్‌ ఎమ్మెల్యే అదితీ సింగ్‌ సైతం కశ్మీర్‌ నిర్ణయం పట్ల కేంద్రానికి మద్దతుగా నిలిచారు. ఇప్పటికే కశ్మీర్‌ పట్ల కాంగ్రెస్‌ వైఖరితో విభేదిస్తూ.. రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్‌ విప్‌గా ఉన్న భువనేశ్వర్‌ కాలితా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దేశ ప్రజల మనోగతానికి భిన్నంగా తాను వ్యవహరించలేనని వ్యాఖ్యానించారు.