కాశ్మీర్ బిల్లుపై చర్చకు టీఆర్‌ఎస్ దూరం

జమ్ముకాశ్మీర్ విభజన బిల్లు, ఆర్టికల్ 370, 35ఏ రద్దు అంశంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు ఎందుకు పాల్గొనలేదనేది చర్చనీయాంశంగా మారింది. దేశానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన అంశంపై రాజ్యసభలో చర్చ జరుగుతుంటే టీఆర్‌ఎస్ పక్షం నాయకుడు కే.కేశవరావు, ఆ పార్టీకి చెందిన ఇతర సభ్యులెవ్వరు కూడా అందులో పాల్గొనలేదు.

కేశవరావు చర్చ జరిగినంత సేపు రాజ్యసభలో కదలకుండా కూర్చున్నారు. అయినా ఆయన జమ్ముకాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు అంశంపై పార్టీ అభిప్రాయాలను సభ ముందు పెట్టకపోవటం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకే కేశవరావు రాజ్యసభలో జమ్ముకాశ్మీర్ అంశంపై దినమంతా జరిగిన చర్చలో పాల్గొనలేదనే ప్రచారం జరుగుతోంది.

రాజ్యసభలో ట్రిపు ల్ తలాక్ బిల్లు చర్చకు వచ్చినప్పుడు కూడా కేశవరావు మాట్లాడకపోవటం గమనార్హం. అప్పుడు జరిగినట్లే ఈ రోజు జమ్ముకాశ్మీర్ విభజన బిల్లు, ఆర్టికల్ 370, 35ఏ రద్దు అంశంపై కేశవరావు పెదవి విప్పలేదు. చివరకు ఆయన పక్కవారితో కూడా పెద్దగా మాట్లడకపోవటం గమనార్హం.

విభజన అంశంపై టీఆర్‌ఎస్ అభిప్రాయాలను సభ ముందు ఎందుకు పెట్టలేదనే ప్రశ్నకు కేశవరావు వైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు. కేశవరావు ఫోన్‌కు అందకుండా ఉండిపోవటం గమనార్హం. జమ్ముకాశ్మీర్ విభజన బిల్లుకు తెలుగుదేశం, వైసీపీ మద్దతు తెలిపితే తెలంగాణ రాష్ట్ర సమితి దీనికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.