ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీరీ పండిట్ల సంబరాలు

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కశ్మీరీ పండిట్లు స్వాగతించారు. తమ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 1990వ దశకంలో కశ్మీర్ లోయ నుంచి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లిన పండిట్లు.. తాము హుందాగా, గౌరవంగా తమ మాతృభూమికి తిరిగి వెళ్లేందుకు మార్గం ఏర్పడిందని పేర్కొన్నారు. 

భారత్‌తో జమ్ముకశ్మీర్ ప్రాదేశిక, రాజకీయ, సాంస్కృతిక ఐక్యతను కేంద్రం నిర్ణయం పటిష్ఠం చేస్తుందని అంతర్జాతీయ కశ్మీరీ పండిట్ల సంఘం (జీకేపీడీ) తెలిపింది. 370 అధికరణను రద్దుచేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టిన బిల్లు.. భారత్ సార్వభౌమత్వం, సమగ్రత కోసం ప్రాణ త్యాగం/ జీవితాన్ని అంకితంచేసిన శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయి వంటి  గొప్ప నేతల ఆలోచనలకు ప్రతిరూపం అని వివరించింది. 

జమ్ముకశ్మీర్ విచార్‌మంచ్ అధ్యక్షుడు మనోజ్ భాన్ స్పందిస్తూ 370వ అధికరణాన్ని రద్దు చేయడం ద్వారా కేంద్రం.. మిగతా భారతదేశానికి జమ్ముకశ్మీర్‌ను మరింత చేరువయ్యేలా చేసిందని చెప్పారు. తాము తిరిగి లోయలోకి వెళ్లేందుకు మోదీ సర్కార్ కార్యాచరణ రూపొందిస్తుందని కశ్మీరీ పండిట్లు ఆశాభావంతో ఉన్నారన్నారు. బలవంతపు వలసలకు గురైన తాము కలిసి జీవించేందుకు పరిష్కారం కనుగొనాలని కేంద్రాన్ని కోరారు. 

కేంద్రం తీసుకొన్న నిర్ణయంతో మాకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని, మా సొంతూరుకు వెళ్లే అవకాశం కలుగుతుందని హైదరాబాద్‌లో కశ్మీర్ పండిట్‌ల సంఘం అధ్యక్షుడు భరత్‌భూషణ్ హర్షం వ్యక్తంచేశారు. అనేక ఏండ్లుగా కొనసాగిన దాష్టీకం వల్ల తాము స్వర్గంలాంటి కశ్మీర్‌లో నరకాన్ని అనుభవించాల్సి వచ్చిందని చెప్పారు. కశ్మీర్ విభజన, 370 అధికరణం రద్దు వల్ల తాము తిరిగి స్వస్థలాలకు వెళ్లి ప్రశాంతజీవనం కొనసాగించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు.