క‌శ్మీర్ విభ‌జ‌న బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం

కశ్మీర్ విభ‌జ‌న బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది. అయితే బిల్లుపై రాజ్య‌స‌భ‌లో ఓటింగ్ స‌మ‌యంలో స‌మ‌స్య త‌లెత్తింది. విభ‌జ‌న బిల్లుపై చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు తొలుత మూజువాణీ ఓటుకు పిలిచారు. అయితే కొంద‌రు స‌భ్యులు డివిజన్ ఓటింగ్ కోర‌డంతో ప్ర‌క్రియ‌కు మ‌రింత స‌మ‌యం ప‌ట్టింది. 

హోంమంత్రి వివరణ అనంతరం ఓటింగ్‌ నిర్వహించగా.. స్వల్ప సాంకేతిక సమస్య రావడంతో స్లిప్పులతో ఓటింగ్‌ చేపట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి.  ఒక‌రు ఓటింగ్‌లో పాల్గొన‌లేదు. దీంతో ఈ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదావేశారు. ఈ బిల్లు రేపు లోక్‌సభ ముందుకు రానుంది.

కశ్మీర్‌లో ఉగ్రవాదం పారదోలాలంటే ఆర్టికల్‌ 370 రద్దు తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా  బిల్లుపై వాడిగా, వేడిగా జరిగిన చర్చకు సమాధానమిస్తూ స్పష్టం చేశారు. 

‘‘దీర్ఘకాలం రక్తపాతానికి కారణమైన 370 అధికరణం పరిసమాప్తమైంది. జనసంఘ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీని గుర్తుచేసుకోవాల్సిన క్షణాలివి. 370 అధికరణంపై ఎలాంటి పరిణామాలు వస్తాయో ఆనాడే ఆయన చెప్పారు. కొంతమంది మాత్రం నిజాలు దాచిపెట్టారు. 370 రద్దు చేస్తే ప్రపంచమే మునుగుతుందన్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు. పాక్‌ నుంచి వచ్చిన శరణార్థులకు దేశవ్యాప్తంగా ఓటు హక్కు వచ్చింది. ఆ శరణార్థులకు జమ్మూకశ్మీర్‌లో మాత్రం ఓటు హక్కు రాలేదు. పాక్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రధానులు అయ్యారు. సరైన విద్యావకాశాలు లేక కశ్మీర్‌ యువత వెనుకబడి ఉంది. స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు ఇచ్చిన 73, 74 సవరణలు కశ్మీర్‌లో అమలు కాలేదు" అని పేర్కొన్నారు.