370 రద్దుతో కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడతాయి

370 రద్దుతో కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడతాయని హోమ్ మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు.  దీనిపై అపోహలు వద్దని చెబుతూ కశ్మీర్‌లో జరిగిన మారణహోమాలకు బాధ్యులు ఎవరు?. ప్రజల బలిదానాలకు బాధ్యత ఎవరు వహిస్తారు? అని ప్రశ్నించారు. దీర్ఘకాల రక్తపాతానికి కారణమైన 370 కథ ముగిసింది. 370 వల్ల కశ్మీర్‌ ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదని స్పష్టం చేశారు. 

370, 35ఎ జమ్మూకశ్మీర్‌, లడఖ్‌కు తీవ్రనష్టం కలిగించాయని చెబుతూ 1950 నుంచి ఇప్పటి వరకు కశ్మీర్‌లో రక్తపాతం కొనసాగుతూనే ఉందని చెప్పారు. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ కలలు నెరవేరుతున్న సమయమిదని పేర్కొంటూ "మేం ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేయడం లేదు. 370 రద్దు చేస్తే ఏదో జరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌ శరణార్థులకు దేశవ్యాప్తంగా ఓటు హక్కు వచ్చింది. కశ్మీర్‌ ప్రజల కోసం గుజ్రాల్, మన్మోహన్‌ ప్రభుత్వాలు ఏం చేశాయి?. జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఉండి ఆజాద్‌ ఏం చేశారు" అంటూ ప్రశ్నించారు. 

70 ఏళ్లుగా కశ్మీర్‌ ప్రజలకు అన్యాయం జరిగిందని తెలుపుతూ 370 రద్దుతో మహిళలకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివాసీలకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుందిని ధీమా వ్యక్తం చేశారు.  70 ఏళ్లుగా కశ్మీర్‌ను మూడు కుటుంబాలకే పాలించాయని అంటూ ఆ కుటుంబాల ఆశీర్వాదం ఉంటేనే వ్యాపారం చేయగలరని మండిపడ్డారు.  

ప్రపంచమంతా ఎక్కడో ఎదిగిపోతుండగా కశ్మీర్‌ మాత్రం జవహర్‌లాల్‌ పాలసీ దగ్గరే ఆగిపోయిందని దుయ్యబట్టారు.  ఓ వర్గం చురుగ్గా పనిచేసి కశ్మీర్‌ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని చెబుతూ ఇకపై ఆ పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. కశ్మీర్‌ను పాలించే కుటుంబాలు మాత్రం లండన్‌లో సౌకర్యంగా బతుకుతాయని, కశ్మీరీలు మాత్రం 18వ శతాబ్దంలో మగ్గిపోతారని ఎద్దేవా చేశారు. ఇదేనా మనం కోరుకుంటున్న ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు.

"కశ్మీరీ యువతకు మేం ధైర్యం చెప్పాలనుకుంటున్నాం. వారికి ఉద్యోగం కల్పించి, కొత్త భవిష్యత్‌ ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే 370 ఆర్టికల్‌ను రద్దు చేశాం" అని అమిత్ షా తెలిపారు. 

కాగా, జమ్ముకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం పరిధి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) వరకు వర్తిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు.  రాజ్యసభలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ ఆర్టికల్‌ 370 రద్దు విషయాన్ని బిజెపి మేనిఫెస్టోలోనే చెప్పిందని ఆమె గుర్తుచేశారు. విస్తృత సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

జనసంఘ్‌ కాలం నుంచే ఈ విషయంపై చర్చ జరుగుతోందని.. సంబంధిత వ్యక్తులతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఎన్నో పురోగామి చట్టాలకు అడ్డంకిగా మారిందని ఆమె పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళల సమాన అవకాశాలకు ఆర్టికల్‌ 370 రద్దు తప్పనిసరని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.