తెలంగాణలో `మహాకుటమి’గా కాంగ్రెస్, టిడిపి

బిజెపికి వ్యతిరేకంగా `మహాకుటమి’ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుండగా, మొదటగా తెలంగాణలో విజయం సాధించింది. 36 సంవత్సరాల `రాజకీయ శత్రుత్వం’కు ముగింపు పలుకుతూ, కాంగ్రెస్ వ్యతిరేకత నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీతో తెలంగాణలో పొత్తును ఖరారు చేసుకో గలిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను ఓడించడం కోసం ప్రస్తుతం నాలుగు పార్టీలతో `మహాకుటమి’ ఏర్పాటుకు రంగం సిద్దమైనది.

కాంగ్రెస్, టిడిపి లతో పాటు సిపిఐ, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో కలసి పనిచేసిన ఉద్యమ నేత ఎం కోదండరామ్ ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి (టిజేఎస్)లతో కలసి ప్రస్తుతం కూటమిగా ఎర్పడుతున్నారు. సిపిఎంను కుడా కూటమిలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ నేతలు మంగళవారం సాయంత్రం సమావేశమై కూటమి ఏర్పాటు గురించి ప్రకటించారు. అంతకు ముందు రోజే టిడిపి, సిపిఐ, టిజేఎస్ నేతలు కూటమి ఏర్పాటు గురించి సమాలోచనలు జరిపారు.

వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసి కేసీఆర్‌కు చెక్‌పెట్టాలని ఈ కూటమి నిర్ణయం తీసుకుంది.  ప్రజా వ్యతిరేకిగా నిలిచిన కేసీఆర్‌ను ఓడించడాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చాయి. విడి విడిగా ఎన్నికల ప్రణాళిక బదులుగా  ఉమ్మడి గా ఎన్నికల ప్రణాళిక రూపొందించే అంశంపై కూడా ఈ పక్షాలు చర్చించాయి. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రణాళిక తదితర అంశాలపై త్వరలో జరిగే నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. మహాకూటమిలో ప్రజా సంఘాలను, ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే శక్తులను కలుపుకొని పోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఈ పెద్దిరెడ్డి, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల హక్కులను కాలరాసిన కేసీఆర్‌ను గద్దె దించుతామని ఈ సందర్భంగా  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు