ఆర్టికల్‌ 370 రద్దుకు టిడిపి, బీఎస్పీ మద్దతు

జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దుపై టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి టిడిపి మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. జమ్ముకశ్మీర్‌లో ప్రజలు శాంతి, సామరస్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు. 

కాగా, జమ్మూకశ్మీర్‌ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామ నిటిడిపి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో తెలిపారు.  జమ్ముకశ్మీర్‌ ప్రజలు సంతోషంగా జీవించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమానహక్కులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

గత ఆరు దశాబ్దాలుగా కశ్మీరీల ఆశలు, ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని.. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారికి ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. జమ్ముకశ్మీర్‌ విభజనకు సంబంధించిన బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రవీంద్రకుమార్‌ అభినందనలు తెలిపారు. ఈ అంశంలో కేంద్రానికి టిడిపి మద్దతిస్తుందని చెప్పారు. 

కేంద్రమంత్రి అమిత్‌ షా ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి కొనియాడారు. చారిత్రక బిల్లులను ప్రవేశపెట్టిన ఆయనకు హ్యాట్సాఫ్‌ అని ప్రశంసించారు. కాంగ్రెస్‌ నిర్వాకం వల్లే ఇన్నేళ్లు ఈ బిల్లు నానుతూ వచ్చిందని ధ్వజమెత్తారు. 

 అమిత్‌షా అభినవ వల్లభాయ్‌ పటేల్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కొన్నేళ్లుగా దేశాన్ని పీడిస్తున్న సమస్యను ఒక కొలిక్కి తెచ్చారని అభినందించారు. జాతీయ పతాకాన్ని దహనం చేస్తుంటే చర్యలు తీసుకోకపోవడాన్ని కశ్మీర్‌లోనే చూస్తున్నామని మండిపడ్డారు. దేశానికి రెండు రాజ్యాంగాలు ఎక్కడుంటాయని ప్రశ్నించారు.   

మరోవంక,  కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు బహుజన్‌ సమాజ్‌ పార్టీ మద్దతుగా నిలిచింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సతీష్‌ చంద్ర మిశ్రా రాజ్యసభలో మాట్లాడుతూ కేంద్రం ఈరోజు ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఎస్పీ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. అధికరణ 370రద్దుతో పాటు ఇతర ఏ బిల్లులనూ వ్యతిరేకించమని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం బిజెపిపై గుర్రుగా ఉన్న ఈ పార్టీ అనూహ్యంగా కేంద్రానికి మద్దతుగా నిలవడం గమనార్హం.

ఇలా ఉండగా, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే హర్షం వ్యక్తంచేశారు. జమ్ముకశ్మీర్‌ను విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర భారతం అన్న మాట ఇవాళ పరిపూర్ణమైందని కొనియాడారు. కేంద్రం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంతో దివంగత నేతలు వాజ్‌పేయీ, బాల్‌ ఠాక్రే స్వప్నం నెరవేరినట్టయిందని పేర్కొన్నారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాకు ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే అభినందనలు తెలిపారు.