ఆర్టికల్‌ 370 రద్దు.. కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్

కశ్మీర్‌పై అనేక ఉత్కంఠ పరిణామాలకు తెరదించుతూ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో ప్రతిపాదించారు. కశ్మీర్‌ అంశంపై తొలినుంచి గోప్యతను పాటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా తన నిర్ణయాన్ని బయటపెట్టింది. దీంతో చారిత్రాత్మక నేపథ్యం, వివాదాస్పదంగా ఉన్న ఆర్టికల్‌ 370 రద్దయింది. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుకు తీర్మానం ప్రవేశ పెట్టిన వెంటనే ఆర్టికల్‌ 35ఏ రద్దుకు కూడా తీర్మానం ప్రవేశపెట్టారు.

కాగా అమిత్‌ షా ప్రకటన మరుక్షణమే ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీంతో కశ్మీర్‌ ప్రత్యేక హక్కులను కోల్పోయి  కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులను కల్పించబడ్డాయి. ఇక పార్లమెంట్‌ చేసే ప్రతిచట్టం దేశమంతటితో పాటు కశ్మీర్‌లోనూ అమలు కానుంది. ఆర్టికల్‌ 370పై పక్కా వ్యూహాన్ని అమలు చేసిన అమిత్‌ షా.. ముందుగానే బిల్లుకు సంబంధించిన వాటిపై పూర్తి కసరత్తు చేసి రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

జమ్ము కశ్మీర్‌ను తాము మిగిలిన దేశంతో అనుసంధానించామని అమిత్‌ షా ఈ సందర్భంగా ప్రకటించారు. భారత  రాజ్యాంగం మొత్తం జమ్ము కశ్మీర్‌లో అమలవుతుందన్నారు. మూడు కుటుంబాలు కలిసి జమ్ముకశ్మీర్‌ను దోచుకొన్నాయన్నారు.

‘‘గులాం నబీ ఆజాద్‌ చెప్పినట్లు 370 చారిత్రాత్మకం అంటున్నారు.. నేను ఆ విషయంలోకి వెళ్లడంలేదు. నేను చెప్పే అంశాలు చరిత్రాత్మకమైనవి. 370 కారణంగా కశ్మీర్‌కు చెందిన చాలా కుటుంబాలు అక్కడ దరిద్రంలో జీవిస్తున్నాయి. దీనిని అడ్డం పెట్టుకొని కొన్ని కుటుంబాలు అక్కడి ప్రజలను దోచుకొన్నాయి. మహారాజ హరిసింగ్‌ చేత భారత్‌లో కలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేశారు. అప్పట్లో ఆర్టికల్‌ 370 లేదు. ఆ తర్వాత వచ్చింది" అని అమిత్ షా గుర్తు చేశారు.

"ఆర్టికల్‌ 370 జమ్ము కశ్మీర్‌ను భారత్‌తో మమేకం కానివ్వలేదు. కశ్మీర్‌ను అడ్డం పెట్టుకొని కొన్ని పార్టీలు ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాలు చేశాయి. మోదీ ప్రభుత్వానికి ఆ అవసరం లేదు. సభ్యులు అందరూ చర్చించాలి.  ఆర్టికల్‌ 370 వచ్చాకే కశ్మీర్‌లో అరాచకాలు మొదలయ్యాయి. కశ్మీర్‌లో దళితులకు రిజర్వేషన్లు దక్కలేదనే విషయం దేశానికి తెలియాలి. కశ్మీర్‌లోకి వెళ్ళే అత్యధిక నిధులు ఎక్కడి పోతున్నాయో చర్చించాలి. నేను ప్రతి  దానికి సమాధానం ఇస్తాను. ఆర్టికల్‌ 370 తొలగించడంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు.’’ అని అమిత్‌ షా రాజ్యసభలో పేర్కొన్నారు. 

కశ్మీర్‌ను పునర్‌విభన చేస్తూ.. మరో బిల్లును కూడా సభ ముందుకు తీసుకువచ్చారు. లఢక్‌ను పూర్తి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుతూ బిల్లును రూపొందించారు. అలాగే చట్టసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్‌ కానుంది. గత వారం రోజులుగా భద్రతా బలగాల మోహరింపుతో కల్లోలంగా మారిన కశ్మీర్‌ వ్యవహారం కీలక ప్రకటనతో ముగిసింది.  దీంతోపాటు కశ్మీర్‌లో నియోజకవర్గ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు కూడా రాజ్యసభ ముందుకు వచ్చింది.

అమిత్‌ షా ప్రకటనపై రాజ్యసభలో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ ప్రభుత్వం రాజ్యంగాన్ని ఉల్లంఘించి ఈ నిర్ణయం తీసుకుందని తీవ్రంగా మండిపడ్డాయి. అయితే బిజెపి,  మిత్ర పక్షాలు హర్షం ప్రకటించాయి. డా. శ్యామ్ ప్రసాద్ ముఖేర్జీ బలిదానం జరిపిన 70 ఏళ్ళ తర్వాత జమ్మూ కాశ్మీర్ భారత్ లో సంపూర్ణ విలీనం సాకారమైన్నట్లు సంబరపడ్డాయి.

కాగా అమిత్‌ షా ప్రకటనకు ముందు ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రిమండలి భేటీ అయిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా దేశానికి సమస్యగా మారిన కశ్మీర్‌ ప్రత్యేక హక్కుల అధికరణను తొలగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీని కోసం ఎన్నో రోజులుగా తీవ్ర కసరత్తు చేసిన మోదీ ప్రభుత్వం.. కీలక సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటించింది.

కశ్మీర్‌కు సమస్యాత్మకంగా మారిన ఆర్టికల్‌ 35ఏ, 370 అధికరణలను రద్దు చేస్తామని గత ఎన్నికల సమయంలో అమిత్‌ షా ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పూర్తి బలంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈమేరకు కీలక ప్రకటన చేసింది.