విభజన అంశాలపై 6న ప్రధానితో జగన్ భేటీ

రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రధాన అజెండాగా ఈ నెల 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఢిల్లీ పర్యటన ఉండనుంది. మంగళవారం ఉదయం హస్తినకు బయలుదేరి వెళ్లనున్న సీఎం.. అదేరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. 

బుధవారం రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్‌ సమావేశం అవుతారు. కాగా పునర్విభజన చట్టానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధానికి ముఖ్యమంత్రి నివేదిక సమర్పించనున్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయడంతో పాటు రెవెన్యూ లోటు భర్తీ, వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంటు, రాష్ట్రంలో ఓడరేవు ఏర్పాటు తదితర అంశాలను మోదీ దృష్టికి జగన్‌ తీసుకువెళ్లనున్నారు. అలాగే గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తరలించడం వెనుక ఉన్న లక్ష్యాలు, తద్వారా రైతాంగానికి కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్‌ టెండర్‌ వల్ల ప్రజాధనం ఆదా అయ్యే విషయం, ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధానికి వివరించనున్నారు.