ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాల పెంపు

దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో పనిచేస్తున్న ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంచుతున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అలాగే వారందరినీ వివిధ సామాజిక భద్రత పథకాల పరిధిలోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రైమ్‌మినిస్టర్ సురక్షా బీమా యోజన కింద ఈ సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఎటువంటి ప్రీమియంను చెల్లించకుండానే, రూ.4 లక్షల ఉచిత బీమా సదుపాయం పొందవచ్చని ప్రధాని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఆశ, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలనుద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ పెరిగిన గౌరవ వేతనాలు అక్టోబర్ నెల నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. అంగన్‌వాడీల గౌరవ వేతనాన్ని రూ.3,000 రూ.4,500కు, ఆశా కార్యకర్తల వేతనాన్ని రూ.2,200 నుంచి రూ.3,500కు పెంచుతున్నట్టు ప్రధాని తెలిపారు. ఇక అంగన్‌వాడీ హెల్పర్ల గౌరవ వేతనాన్ని రూ.1,500 నుంచి రూ,2,500కు పెంచినట్లు చెప్పారు.

ఇవి కాకుండా కేంద్రం నుంచి ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలకు వివిధ రకాల భత్యాలు అందుతున్నాయని ప్రధాని గుర్తు చేసారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి ప్రత్యేక భత్యాలనిస్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 12,83,707 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 10,50,564 మంది హెల్పర్లు ఉన్నారు. ఆశ కార్యకర్తలు 10,23,136 మంది ఉన్నారు. కామన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ (ఐసీడీఎస్-సీఏఎస్)ను ఉపయోగిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ఇస్తున్న అదనపు ఇన్సెంటివ్‌ను రూ.250 నుంచి రూ.500 పెంచుతున్నట్టు ప్రధాని చెప్పారు. అయితే వారి పనితీరు ఆధారంగానే ఈ ఇన్సెంటివ్‌ను చెల్లిస్తారని తెలిపారు.

ఇట్లా ఉండగా, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్‌ను జార్ఖండ్‌లో ఈ నెల 23న ప్రారంభిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద లబ్ధిదారులను ఇప్పటికే గుర్తించామని తెలిపారు. ఈ పథకం కింద మొట్టమొదటి లబ్ధిదారుగా హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన నవజాత శిశువు కరిష్మా ఎంపికైందని చెప్పారు. సెప్టెంబర్‌ను పోషకాహార నెలగా పరిగణిస్తున్నందన ఆరోగ్యకార్యకర్తలు, ఆశ, అంగన్‌వాడీలు ప్రతి ఇంటికి వెళ్లి పోషకాహార ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు.