సంక్లిష్ట పరిస్థితుల్లో స్పీకర్ల వ్యవస్థ

దేశంలో స్పీకర్ల వ్యవస్థ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దానిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరముందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థలతో పాటు ఫోర్త్‌ ఎస్టేట్‌గా మీడియా ఉందని, వ్యవస్థలు గాడి తప్పుతున్నప్పుడు పాత్రికేయులు తప్పక స్పందించాలని సూచించారు. 

శాసనసభ అద్దం లాంటిదని, ఇక్కడ బిల్లులపై చర్చలు అర్ధవంతంగా జరిగినప్పుడు ఫలాలు సామాన్యులకు చేరుతాయని చెప్పారు. వ్యవస్థలను పరిరక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత అందరిపై ఉందని అంటూ ఈ నాలుగు వ్యవస్థలకంటే అత్యంత శక్తివంతమైనది పౌర వ్యవస్థ అని పేర్కొన్నారు. 
పార్టీ ఫిరాయింపులపై చట్టసభల్లో సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరముందని చెబుతూ ప్రజలు ప్రతి అంశాన్ని నిశితంగా గమనిస్తున్నారని తెలిపారు. 

విలువలతో కూడిన రాజకీయాలు కావాలనేది తన అభిప్రాయమని అంటూ రాజ్యసభలో టిడిపికి చెందిన ముగ్గురు సభ్యులను బిజెపిలో చేర్చుకోవడం తప్పేనని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వారే అలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అనైతికతను సమర్ధించడం సరికాదన్నారు. కర్నాటక స్పీకర్‌ నిర్ణయాధికారం విషయంలో గవర్నర్‌ జోక్యంపై స్పందిస్తూ ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకూడని రాజ్యాంగం చెబుతోందని, స్పీకర్‌కు విచక్షణాధికారాలున్నాయని చెప్పారు. 

శాసనసభలో ప్రతిపక్షం గొంతునొక్కుతున్నారని, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అరోపిస్తున్నారని ప్రశ్నించగా అటువంటి  ఆలోచన తనకు లేదన్నారు. ఎవరైనా గతంలో, ఇటీవల శాసనసభలో జరిగిన ప్రొసీడింగ్స్‌ను పరిశీలించి బేరీజు వేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.