ఎత్తిదింపుడు పథకంగా కాళేశ్వరం

 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎత్తిదింపుడు పథకంగా మారిందని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్లారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సరైన సాంకేతికత, ముందు చూపు లేకుండా నిర్మించిందని ధ్వజమెత్తారు. 

మానేరుకు వరద వస్తే అన్నారం బ్యారేజీ నుంచి 3 టీఎంసీల నీటిని వృథాగా వదిలేయడం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం కాదు.. ఎత్తిదించే పథకం అనిపిస్తోందని దయ్యబట్టారు. సాంకేతిక లోపం కారణంగా మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నుంచి నీళ్లు తిరిగి కాళేశ్వరంలోకే వస్తున్నాయని చెప్పారు. 

దీనివల్ల దాదాపు రూ.80 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ నష్టానికి కేసీఆర్‌ బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. మంత్రులు, ఇంజినీర్లు చెప్పిన మాట వినకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు.  

కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని బిజెపి నేత, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. గత ఐదేళ్లుగా నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఆదివారం ఆమె సందర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల ఆకృతి మార్చడం వల్ల పాలమూరు జిల్లా నష్టపోయిందని ధ్వజమెత్తారు. 

గతంలో కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కేసీఆర్‌ విస్మరించారని దుయ్యబట్టారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కొత్తవాటిపై ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని కేసీఆర్‌ ఆరాటపడుతున్నారని ఆరోపించారు.  టీఆర్‌ఎస్‌  హయాంలో పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని డీకే అరుణ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్‌ దృష్టి పెట్టాలని ఆమె హితవు పలికారు.