ప్రభుత్వ విప్‌ చింతమనేని మరోసారి వీరంగం

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ మరోసారి వీరంగం వేశారు. గతంలో పలు ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకొనక పోవడం, పైగా ఫిర్యాదు చేసిన వారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెదిరించారనే కధనాలు వెలువడుతూ ఉండడంతో ఆయన దూకుడుకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నదనే విమర్శలు చెలరేగుతున్నాయి. తన నియోజకవర్గంలో తన మాటే ససనమని, మరేటువంటి చట్టం, నిబంధనలు వర్తించవని తరచూ గుర్తు చేస్తున్నారు.

తాజాగా, సోమవారం రాత్రి దళిత కార్మికుడిని ఇంటికి పిలిపించి మరీ చావబాదిన ఘటనపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి అండ ఉండటంతో తానొక ప్రజా ప్రతినిధినన్న సంగతి సైతం మరిచి చింతమనేని గూండాలా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఏలూరు ఫైర్‌ స్టేషన్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ ఆఫీసు వరకు ప్రదర్శనగా వెళ్లి డిఆర్‌ఒకు వినతిపత్రం ఇచ్చారు. దళితునిపై దాడికి పాల్పడిన ప్రభాకర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

బాధితుడి కథనం ప్రకారం ఏలూరు రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ గోడౌన్‌లో 78 మంది పనిచేస్తున్నారు. రాచిటీ జాన్‌ వారికి 20 ఏళ్లుగా మేస్త్రీగా ఉన్నాడు. గోడౌన్‌లో పనిచేస్తున్న గొర్రెల శ్యాంబాబు ఈ నెల 7న మద్యం బాటిళ్లు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. గతంలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని పని నుండి పక్కనపెట్టారు. ఈసారీ అదేవిధంగా శ్యాంబాబును పక్కన పెట్టాలని కార్మికులంతా నిర్ణయించారు.

అయితే అదే గోడౌన్‌లో పనిచేస్తున్న శ్యాంబాబు బావ చుక్క ఈశ్వరరావు చింతమనేని అనుచరుడైన నేతల రవితో విషయం చెప్పాడు. రవి ఫోన్‌ చేయడంతో సోమవారం ఉదయమే మేస్త్రీ జాన్‌ దుగ్గిరాలలోని ప్రభుత్వ విప్‌ చింతమనేని ఇంటికి వెళ్లాడు. ఆయన లేకపోవడంతో రవికి ఫోన్‌ చేసి చెప్పగా, సాయంత్రం విప్‌ ఇంటివద్దకు రమ్మని చెప్పాడు.

సాయంత్రం జాన్‌, మరో ఐదుగురు కార్మికులు కలిసి చింతమనేని ఇంటికి వెళ్లారు. జరిగిన విషయం ఆయనకు చెప్పగా దొంగతనం చేసిన శ్యాంబాబును మళ్లీ పనిలోకి తీసుకోవాలని చింతమనేని హుకుం జారీ చేశారు. తమ యూనియన్‌ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని వారు తెలపగా ఒక్కసారిగా రెచ్చిపోయిన ప్రభాకర్‌ 'నేను చెప్పిందే వేదం.. ఎదురు చెబుతావా.. చట్టాలు.. సంప్రదాయాలు నా దగ్గర పనిచేయవు' అంటూ మేస్త్రి జాన్‌పై దాడికి దిగారు.

అక్కడే ఉన్న ముగ్గురు గన్‌మేన్లు, మరికొందరు నేతలు మూకుమ్మడిగా పిడిగుద్దులు గుద్దుతూ నేలపై జాన్‌ను ఈడ్చేశారు. డొక్కల్లో, కడుపులో బాదారు. కులంపేరుతో దుర్భాషలాడుతూ, 'నాకే ఎదురు చెబుతావా' అంటూ చింతమనేని బూతులు తిట్టాడని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరుసటి రోజు పలు సంఘాల నాయకులతో కలసి డిఐజి టి.రవికుమార్‌ మూర్తి వద్దకు వెళ్లి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఆయన ఎస్‌పిని కలవమని చెప్పారు. బుధవారం సిఎం పర్యటన నేపథ్యంలో ఎస్‌పి అందుబాటులో లేకపోవడంతో వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు పంపించారు. ఎస్‌పి సూచన మేరకు త్రీటౌన్‌లో ఫిర్యాదు ఇచ్చినట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.

ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌ దౌర్జన్యపురితంగా వ్యవహరించిన పలు వివాదాలలో ఇప్పటికే ఉన్నారు. కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్‌ వనజాక్షి, హనుమాన్‌ జంక్షన్‌లో ఆర్టీసీ సిబ్బందిపై, పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి ఎస్‌ఐపై దాడి, గుండుగొలను సెంటర్‌లో ఎఎస్‌ఐ., సిపిఒలపై, జర్నలిస్టులపై, అంగన్‌వాడీలపై దురుసుగా ప్రవర్తించిన్నట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.