కాశ్మీర్ లో అమిత్ షా పర్యటన

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈనెల 7న పార్లమెంటు సమావేశాలు పూర్తయిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో పర్యటింపనున్నారు. కాశ్మీర్‌ లోయలో తాజా పరిస్థితుల నేపథ్యంలో హోంమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో ఇప్పటికే అమర్‌నాథ్‌ యాత్రికులు, పర్యాటకులను కశ్మీర్‌ నుంచి ప్రభుత్వం వెనక్కి పంపించింది. కాగా ఓవైపు భారీగా బలగాల మోహరింపు.. మరోవైపు కేంద్రం మౌనంతో జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది.   

కశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర రద్దయిన నేపథ్యంలో కొద్ది రోజుల పాటు హోం మంత్రి అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  

ఉగ్రదాడులకు అవకాశమున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రికులు వెనక్కి తిరిగి వెళ్లాలని, తుదపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని రాష్ట్ర హోం శాఖ గత శుక్రవారం అడ్వయిజరీ విడుదల చేసింది. దీంతో సుమారు 6 వేల మంది యాత్రికులు, పర్యటకులు కశ్మీర్ నుంచి వెనుదిరిగారు. 

యాత్రికులు, పర్యాటకుల రక్షణ తమ బాధ్యతని, చొరబాటు కోసం సరిహద్దుల్లో ఉగ్రవాదులు పొంచి ఉండటం, అందులో ఆత్మాహుతి బాంబర్లే ఎక్కువగా ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా యాత్రను రద్దు చేసినట్టు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివరణ ఇచ్చారు. 

సరిహద్దు సమీప ప్రాంతాల్లోని ప్రజలు బంకర్లకు తరలి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే యాత్రికులు, పర్యాటకులు స్వస్థలాలకు తిరుగు ముఖం పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు అదనపు సర్వీసులను నడుపుతున్నాయి.

 ప్రభుత్వ హెచ్చరికలు చేసిన నాటికి 11వేల మందికి పైగా పర్యాటకులు ఉండగా.. ప్రస్తుతం 1650 మంది మాత్రమే ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు 6,216 మంది శ్రీనగర్‌ విమానాశ్రయం నుంచి వెళ్లినట్లు విమాశ్రయ వర్గాలు తెలిపాయి.