ఉన్నావ్‌ బాధితురాలి కారు ప్రమాదంపై సిబిఐ విచారణ ముమ్మరం

ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన కేసులో సిబిఐ విచారణ ముమ్మ రం చేసింది. జులై 28వ తేదీన రారుబరేలీ వద్ద కారును లారీ డీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలి పిన్ని, అత్త మృతిచెందగా బాధితురాలు, న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. బిజెపి ఎమ్మెల్యే కులదీప్‌ సెంగారే ఈ ఘటనకు ఒడిగట్టాడని బాధితు రాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

అనంతర పరిణామాల నేపథ్యంలో విచారణపై రంగంలోకి దిగిన సిబిఐ అధికారుల బృందం శుక్ర, శనివారాల్లో బాధితులతోపాటు, జెల్లో ఉన్న నిందితుడు, ఎమ్మెల్యే కులదీప్‌ను విచారించారు. విచారణలో భాగంగా ఆదివారం రాష్ట్రంలోని 17 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో పలు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.

ఘటన తీరును తెలుసుకునేందుకు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. కారును డీకొట్టిన సమయంలో లారీ నెంబరు ప్లేటు కనిపించ కుండా ఉంది. అంతకుముందు టోల్‌ప్లాజా దగ్గర కూడా నెంబరు ప్లేటు లేకుండానే లారీ వెళ్లిందని, ఆ సమయంలో అక్కడ సిబ్బంది ఎందుకు గమనించలేదనే అంశంపై అధికారులు విచారణ చేస్తున్నారు. లారీ యజమాని తనపై ఎవరి ఒత్తిడి లేదని పేర్కొన్నాడు. 

వాహన కొనుగోలుకు ఆర్థిక సాయం చేసిన సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ.. గతంలో అతను ఇఎంఐ చెల్లించలేదని, ప్రస్తుతం అన్నీ చెల్లించేశాడని తెలిపారు. లారీ డ్రైవర్‌, క్లీనర్లను మూడు రోజులపాటు విచారణ కోసం సిబిఐ అదుపులోకి తీసుకుంది. అత్యాచార బాధితురాలికి భద్రతగా నియమించిన సిబ్బంది ఘటన సమయంలో లేరు. దీంతో వారిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. 

ఈ ఘటనలో గాయపడిన బాధితురాలి పరిస్థితి విషమం గానే ఉంది. లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్శిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి నియోనియా పెరిగిందని వైద్యులు తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం బాధితురాలికి సిఆర్‌పిఎఫ్‌ భద్రత కల్పించారు. కుటుంబ సభ్యులు, వైద్యులను మినహా ఎవరినీ అనుమతించడం లేదు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితురాలి తరుపు న్యాయవాదికి అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

మరోవంక, ఉన్నావ్‌ ఘటనలో నిందితుడిగా ఉన్న ఎంఎల్‌ఎ కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ తుపాకీ లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేసింది. అతనికి బారెల్‌గన్‌, రైఫిల్‌, రివాల్వర్‌ లైసెన్సు ఉండేవి.