పార్టీ కార్యకర్తలను ఎంత మాత్రం విస్మరించొద్దు: మోదీ

‘మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ కార్యకర్తలను ఎంత మాత్రం విస్మరించొద్దు. వారితో మమేకమై పనిచేయండి’ అని పార్టీ ఎంపీలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్భోదించారు. తాము ఈ స్థితికి రావడానికి కార్యకర్తల కృషే కారణమన్న వాస్తవాన్ని ఎంపీలు విస్మరించకూడదని కార్యకర్తలను ఆదరించి వారితో కలిసి పనిచేయాలని మోదీ తెలిపారు.

రెండు రోజుల శిక్షణా కార్యక్రమం సందర్భంగా శనివారం పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన కొత్తగా ఎన్నికైన 380 మంది పార్టీ ఎంపీల నుద్దేశించి మోదీ మాట్లాడుతూ ఎంపీలుగా ఎదిగినంత మాత్రాన ఇటు పార్టీనీ, అటు కార్యకర్తలను మరచిపోకూడదని హితవు చెప్పారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాదు, ఇతర సమయాల్లో కార్యకర్తలను ఆదరించాలని, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఎంపీలకు స్పష్టం చేశారు.

కార్యకర్తల కృషి, పట్టుదల, నిరంతర శ్రమ వల్లే బీజేపీ అంచెలంచెలుగా తిరుగులేని పార్టీగా ఎదిగిందని మోదీ గుర్తు చేశారు. దీని దృష్ట్యా ప్రతి ఎంపీ అనునిత్యం ఓ కార్యకర్త పనిచేసే స్ఫూర్తితోనే పనిచేయాలని మోదీ తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలు, ఆలోచనలే ఆ పార్టీని ప్రస్తుత ఉన్నత స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు. ఈ పార్టీ అనూహ్యంగా ఎదగడం వెనుక ఏ కుటుంబ వారసత్వం లేదని ఆయన స్పష్టం చేశారు. ,

బీజేపీని ఓ కుటుంబంగా అభివర్ణించిన మోదీ ఇదో నేతల సమూహం కాదని, అంచెలంచెలుగా ఎదిగిన ఓ మహాకుటుంబం అని తెలిపారు.  ‘బీజేపీ కృత్రిమంగా ఏర్పడిన పార్టీ కాదు. క్షేత్రస్థాయి నుంచి బలంగా ఏర్పడిన పార్టీ. సైద్ధాంతిక బలం, ఆలోచనా విధానం కారణంగానే ఈ స్థాయికి చేరుకుంది. అంతేగానీ, ఏదో ఒక్క కుటుంబ వారసత్వంపై నడుస్తున్న పార్టీ కాదు’ అని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.

పార్టీని, పార్టీ కార్యకర్తలను తల్లితో పోల్చిన మోదీ.. ‘కుమారుడిని పెంచి పెద్దచేసిన తల్లి.. పెళ్లయిన తర్వాత ఆ కొడుకు తన కంటే భార్యపైనే ఎక్కువ మమకారం చూబితే చిన్నబుచ్చుకుంటుంది. అలాంటి కొడుకు మాదిరిగా కాకుండా ఎంపీలు, మంత్రులు అయిన మీరు పార్టీని, కార్యకర్తలను మరవకండి. మీకోసం ఎంతో శ్రమకోర్చిన కార్యకర్తలతో సంబంధాలు కొనసాగించండి’ అని వారికి ఉద్బోధించారు.

చట్ట సభల సభ్యులైనా, మంత్రులయినా పార్టీ కార్యకర్తగా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు. సంస్థాగతంగా పార్టీ ఎప్పటికప్పుడు బలోపేతం కావాలని పేర్కొన్న ఆయన ఇటీవల త్రిపుర స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ గతంలో తాను సూరజ్ కుంద్‌లో జరిగిన పార్టీ శిక్షణా కార్యక్రమానికి హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ కార్యక్రమానికి తారు హాజరుకావడం వల్ల తాను ఎంతో నేర్చుకున్నానని చెబుతూ వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తి ఓ విద్యార్థి మాదిరిగానే నేర్చుకోవాలని, ఇది నిరంతరం ఓ ప్రక్రియగా ప్రతీ ఒక్కరికీ అలవాటు కావాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మాట్లాడారు. రెండు రోజుల ఈ శిక్షణ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా కూడా ప్రసంగించారు. జేపీ నడ్డా ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ తదితరులు వేదికపై నుంచి కిందికి దిగి మిగతా ఎంపీల మధ్యన కూర్చున్నారు.