వాటికన్ జోక్యం కోరిన కేరళ నన్

లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్‌లోని జలంధర్ రోమన్ క్యాథలిక్ చర్చి బిషప్ ఫ్రాంకో ములక్కల్ కేసులో బాధితురాలు వాటికన్ సిటీ జోక్యాన్ని కోరారు. బిషప్ ఫ్రాంకో 2014-2016 మధ్య తనపై 13సార్లు లైంగికదాడికి పాల్పడ్డారని, అసహజ శృంగారం చేశారని బాధితురాలు ఇటీవల కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా కేసు ముందుకుసాగడం లేదని, బిషప్ ఫ్రాంకో తన హోదాను అడ్డం పెట్టుకొని ఆర్థిక, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేసును మూసివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. వెంటనే ఆయనను బిషప్ పదవి నుంచి తొలిగించాలని, అత్యవసరంగా జోక్యం చేసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరుపాలని కోరుతూ వాటికన్ సిటీ ప్రతినిధి గియామ్‌బట్టిస్టా డిక్వాట్ట్రోకు ఈ నెల 8వ తేదీన లేఖ రాశారు. స్థానిక చర్చిలు తనకు న్యాయం చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

కాగా, మహిళలకు చర్చి సవతి తల్లిలా తయారయ్యిందని ఆమె ద్వజమెత్తారు.  ''చర్చిని తల్లిలా విశ్వసించాలని చిన్నప్పటి నుండి బోధించారు. కాని నాకు ఎదురైన అనుభవం వల్ల చర్చి మహిళలకు, ప్రజలకు సవతి తల్లిలాంటిదని భావిస్తున్నాను'' అని ఆమె లేఖలో పేర్కొన్నారు. ''చర్చిలో ఎవరైతే గౌరవనీయులో, ఎవరైతే రక్షణ కల్పిస్తామని భావిస్తున్నామో వారి నుండే లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. వారిని ప్రతిఘటించే శక్తి లేక చాలా మంది సిస్టర్లు, మహిళలు మౌనంగా బాధను భరిస్తున్నారు.'' అని ఆమె తెలిపారు.

తనకు ఎదురైనా కష్టాలను వివరిస్తూ తన విషయంలో సహాయపడాలని పోప్‌తో సహా ప్రతి ఒక్కరిని అభ్యర్ధించానని తెలిపారు. అయితే అందరూ కళ్ళుమూసుకున్నారే తప్ప, లైంగిక వేధింపుల నిందితుడు బిషప్‌పై ఎటువంటి చర్య తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక్కతినే బాధితురాలిని కాదని, ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని ఆమె స్పష్టం చేసారు.

చర్చి అధికారులు ఈ విధంగా మౌనం వహించడం, నేరానికి పాల్పడిన వారికి రక్షణ కల్పించడం చేస్తుంటే సమాజంలో చర్చి విశ్వసనీయతను కోల్పోతుందని ఆమె హెచ్చరించారు. చర్చిలో చోటు చేసుకుంటున్న ఇలాంటి సంఘటనలు మహిళలపై దుష్ప్రభావాన్ని చూపుతాయని ఆమె వారించారు. మత విశ్వాసాన్ని పణంగా పెట్టి మానవులుగా గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇలా లేఖ రాయడం మినహాయించి వేరే ప్రత్యామ్నాయం తమకు లేదని ఆమె పేర్కొన్నారు.