కుమారస్వామిలో వైరాగ్యం... రాజకీయాలకు గుడ్‌బై !

అధికారం కోల్పోవడంతో కర్నాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిలో వైరాగ్యం కనిపిస్తున్నది.  రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు సంచలన వాఖ్యలు చేశారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని.. అనుకోకుండానే సీఎంను అయ్యానని పేర్కొన్నారు. 

రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆ భగవంతుడు కల్పించాడని చెప్పారు. ఎవరినో సంతృప్తిపరిచేందుకు తాను రాజకీయాల్లో లేనని, తాను సీఎంగా పనిచేసిన 14 నెలలు ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేశానని, తాను సంతృప్తి చెందానని కుమారస్వామి తెలిపారు.

ప్రస్తుత రాజకీయాలు ఎటువైపు పోతున్నాయో తాను గమనిస్తున్నానని, రాజకీయాలు మంచి వాళ్ల కోసం కాదని.. రాజకీయాలు కుల సమీకరణాలతో కూడుకున్నవని అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు.  ఆ కులాల రొంపిలోకి తన కుటుంబాన్ని లాగొద్దని కోరారు. తాను ప్రశాంత జీవనాన్ని గడపాలనకుంటున్నానని,  అందువల్లే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు కుమారస్వామి వెల్లడించారు. 

తాను అధికారంలో ఉన్నప్పుడు మంచే చేశానని, ప్రజల గుండెల్లో తనకూ కొంత చోటు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా పనిచేసినప్పటికీ పలు సందర్భాల్లో కాంగ్రెస్ తీరుపై కుమారస్వామి అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఓ సందర్భంలో కాంగ్రెస్ తీరు పట్ల కుమారస్వామి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడం, తదనంతర పరిణామాలు కుమారస్వామి ఈ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసినట్లు భావిస్తున్నారు. 

మరోవంక తన రాజకీయ వారసుడిగా కుమారుడు నిఖిల్ ను ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందిన నిఖిల్ గౌడను కృష్ణరాజపేట అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.  భవిష్యత్తులో పార్టీ బాధ్యతలు కూడా నిఖిల్‌ చేతిలో పెట్టే వ్యూహంలో భాగంగానే నిఖిల్‌ను అసెంబ్లీకి పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.