బిజెపి దూకుడుతో తెలుగు సీఎంల ఖంగారు!

రెండు తెలుగు రాష్ట్రాలలో 2023 నాటికి అధికారపక్షంగా మారడం కోసం బీజేపీ నాయకత్వం దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడం ఇద్దరు ముఖ్యమంత్రులకు కలవరం కలిగిస్తున్నది. ఒకొక్క రాష్ట్రంపై దృష్టి సారిస్తూ వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్న బిజెపి ఎత్తుగడల పట్ల వీరిద్దరూ ఖంగారు పడుతున్నారు. 

తెలంగాణ సీఎం చంద్రశేఖరరావును ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రత్యేకంగా కలసి, సుమారు మూడు గంటలసేపు జరిపిన చర్చలలో ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలే ప్రస్తావనకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది. 

మీడియాకు మాత్రం రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారం, గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించడం గురించి చర్చించినట్లు పేర్కొన్నా వాస్తవానికి బిజెపి దూకుడు గురించే ఎక్కువగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. 

తెలంగాణలో అన్ని సీట్లు గెల్చుకొని, కేంద్రంలో చక్రం తిప్పాలని కలలుగన్న కేసీఆర్ కేంద్రంలో బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం సంపాదించుకోవడంతో పాటు తెలంగాణలో సొంతంగా నాలుగు సీట్లలో గెలుపొందడంతో ఖంగుతిన్నారు. పైగా సొంత కూతురు, సన్నిహితుడైన ఎంపీ ఓటమి చెందడాన్ని తమాయించుకోలేక పోతున్నారు. 

ఏపీలో అనూహ్యంగా 151 సీట్లు గెల్చుకున్న వైసిపి నాయకత్వంకు  ఆ విజయం వెనుక బిజెపి ప్రచ్ఛన్న హస్తం ఉన్నదని తెలుసు. చంద్రబాబునాయుడును గద్దె దింపడం కోసం బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేయడం తమకు కలసి వచ్చినదని గ్రహించారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు, ప్రధాన ప్రతిపక్షం టిడిపి కుంగిపోతూ ఉండటం టిడిపిలోకన్నా వైసిపి నేతలకే ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నది. 

నైతిక స్థైర్యం కోల్పోయిన టిడిపి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటేనే తామెట్లాగు పాలన సాగించిన అడ్డు ఉండబోదని, బిజెపి బలపడితే తమ ఆటలు సాగవని భయపడుతున్నారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో టిడిపి నేతలు బీజేపీలో చేరుతున్నా రాబోయే రోజులలో అంతర్గతంగా జగన్ పాలనపట్ల పెరుగుతున్న అసహనం నుండి బిజెపి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అధికార పక్షం నుండి కూడా బిజెపిలోకి వలసలు ప్రారంభం కావడం ఎక్కువసేపు పట్టదని గ్రహిస్తున్నారు. 

రెండు రాష్ట్రాలలో బిజెపి సభ్యత్వ కార్యక్రమం ఉదృతంగా జరుగుతున్నది. తెలంగాణలో అయితే స్వయంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో రెండు రాస్త్రాలలో బిజెపిని కట్టడి చేయలేని పక్షంలో తామిద్దరం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఇద్దరు సీఎంలు ఆత్మరక్షణలో పడిన్నట్లు కనిపిస్తున్నది. ప్రస్తుతం బిజెపిపై పోరాటం చేయగల తెగువ ఇద్దరు సీఎంలతో కనబడటం లేదు.  

అందుకనే ప్రస్తుత సమయంలో రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీని నిలువరించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ఒక నిర్ణయానైకి వచ్చిన్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడు గనక రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోకపోతే మాత్రం భవిష్యత్తులో తమకు చాలా సమస్యలు వస్తాయని, ఆసమయంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోలేమని నిర్ధారణకు కూడా వచ్చిన్నట్లు చెబుతున్నారు.