విశ్వాసం కలిగించలేకపోతున్న జగన్ పాలన

రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి రెండు నెలల పాలన ప్రజల్లో విశ్వాసం కలిగించలేకపోయిందని బీజేపీ మహిళా మోర్చా జాతీయ కన్వీనర్ దగ్గుబాటి పురంద్రీశ్వరి విచారం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడీ, ప్రభుత్వ పథకాల్లో అవినీతి కారణంగానే చంద్రబాబునాయుడు ప్రజా విశ్వాసం కోల్పోయారని గుర్తు చేస్తూ అటువంటి పరిస్థితి జగన్మోహన్‌రెడ్డి తెచ్చుకోకూడదని హెచ్చరించారు.

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడానికి రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చేవిధంగా రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం ఉండాలని ఆమె సూచించారు. ఇసుక కొరత కారణంగా పేదవర్గాలు పలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక విధానం లేకపోవడం వల్ల నిర్మాణ రంగం కుదేలైందనని.. స్టోన్‌ క్రషర్లు కూడా 90శాతం మూతపడ్డాయని చెప్పారు. దీంతో కూలీలు పనులు లేక పొట్ట మాడ్చుకుంటున్నారన్నారు.

అవకాశం లేదని కేంద్రం స్పషీకరించినా ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని పురంద్రీశ్వరి ధ్వజమెత్తారు. హోదా రాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే స్పష్టం చేశారని, అయినా ప్రత్యేక హోదా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆమె హితవు చెప్పారు. దేశంలో ఏడు రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయని, ఏ రాష్ట్రానికీ ఇచ్చే అవకాశం లేదని, హోదా కింద వచ్చే ప్రయోజనాలన్నీ సమకూర్చే విధంగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారని ఆమె గుర్తుచేశారు.

అయినప్పటికీ గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ సందర్భంగా తమకు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని జగన్ వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమో ప్రజలు గమనించాలని ఆమె కోరారు. ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయేలా అడుగులు వేయొద్దని ఆమె జగన్ ను హెచ్చరించారు. విద్యుత్‌ పీపీఏల అంశంలో కేంద్రంపై నెపం నెట్టడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. పీపీఏల రద్దు సమంజసం కాదని.. మరోసారి సమీక్షించుకోవాలని సూచించారు.