సర్వోత్కృష్ట వర్శిటీలుగా హైదరాబాద్, ఆంధ్ర వర్సిటీలు

దేశంలో సర్వోత్కృష్ట వర్శిటీల (ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్) జాబితాలో తెలంగాణ నుంచి రెండు, ఏపీ నుండి రెండు వర్శిటీలకు చోటు లభించింది. ఈ ఎంపిక ప్రక్రియను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ పూర్తి చేసి జాబితాను  ప్రకటించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్స్‌, ఆంధ్ర యూనివర్సిటీ, క్రియా యూనివర్శిటీ (శ్రీసిటీ-ఏపీ)లకు ఈ గుర్తింపు లభించింది.

దేశవ్యాప్తంగా ఏడు ప్రభుత్వ వర్శిటీలకు, 12 ప్రైవేటు, స్పాన్సార్డు యూనివర్శిటీలకు మరో 8 ఇతర సంస్థలకు సర్వోత్కృష్ట హోదాను యూజీసీ ఇచ్చింది. ఎమినెన్స్ హోదా పొందిన వర్శిటీలకు రానున్న ఐదేళ్లలో వెయ్యి కోట్ల రూపాయిలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఆయా వర్శిటీలను ప్రపంచస్థాయి వర్శిటీలుగా అభివృద్ధి చేయనుంది.

 ప్రకటించిన వర్శిటీల్లో బెనారస్ హిందూ యూనివర్శిటీ, తేజ్‌పూర్ యూనివర్శిటీ, సావిత్రీభాయ్ పూలే పూనే యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ, అలిఘర్ ముస్లిం యూనివర్శిటీ, పంజాబ్ యూనివర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీ ఉన్నాయి. ఐఐటీ ముంబై, ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్, బిట్స్ పిలానీ, మణిపాల్ అకాడమి ఆఫ్ హయ్యర్ ఇనిస్టిట్యూట్, జియో ఇనిస్టిట్యూట్‌ లు కూడా ఉన్నాయి.

వీటితో పాటు ప్రైవేటు రంగంలో అమ్రిత విశ్వవిద్యాపీఠం, వెల్లూరు వీఐటీ, జామియా హందర్ద్ యూనివర్శిటీ, శివనాడర్ యూనివర్శిటీ, అజీం ప్రేమ్‌జీ యూనివర్శిటీ, అశోకా యూనివర్శిటీ, భువనేశ్వర్ కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇన్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ సెటిల్‌మెంట్స్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్స్ (తెలంగాణ), సత్య భారతి యూనివర్శిటీ (హర్యానా) ఎంపికయ్యాయి.

చాలా కఠినమైన ప్రక్రియ ద్వారా వీటిని ఎంపిక చేశారు. ప్రపంచంలో వివిధ సంస్థలు నిర్వహిస్తున్న ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో కనీసం టాప్ -500లో తరచూ ఎంపికైన వర్శిటీలను వడపోత పోసి వీటిని యూజీసీ ఎంపిక చేసింది. 2018 జూలైలో 11 సంస్థలకు ఎమినెన్స్ హోదాను కల్పించారు. వాటిలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్, జాదవ్‌పూర్ యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్శిటీ, అన్నా యూనివర్శిటీ ఉన్నాయి.

భారతదేశంలో చాలా వర్శిటీలు ప్రారంభించి వందేళ్లు పూర్తవుతున్నా, ఒక్కటి కూడా ప్రపంచంలో ప్రఖ్యాత విద్యాసంస్థల జాబితాలో చోటు సంపాదించుకోకపోవడంతో రానున్న రోజుల్లో భారత్ విద్యాసంస్థలకు సైతం ప్రాధాన్యత దక్కేలా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక పథకాన్ని 2016లో ప్రకటించడంతో పాటు బడ్జెట్‌లో నిధులను సైతం కేటాయించింది. 2017లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీచేసింది.

దేశంలో అన్ని యూనివర్శిటీలకూ నేషనల్ ర్యాంకింగ్ కల్పించి 2018 మేలో తొలి నివేదికను ఇచ్చింది. ఆ నివేదిక అనుసరించి ప్రైవేటు రంగంలో మూడు, ప్రభుత్వ రంగంలో మూడు సంస్థలకు ఎమినెన్స్ హోదా కల్పించారు. మరికొన్ని యూనివర్శిటీలకు కూడా ఈ హోదా కల్పించాలన్న డిమాండ్ మేరకు యూజీసీ కసరత్తు చేసింది. రెండో నివేదికను నిపుణుల కమిటీ శుక్రవారం సమర్పించింది. దీంతో తాజాగా మరికొన్ని వర్శిటీలకు సర్వోత్కృష్ట హోదా దక్కింది.