చీలిక దిశగా కర్ణాటక కూటమి !

బల పరీక్షలో ఓడిపోయిన వారం రోజులకే కర్ణాటక కూటమిలో చీలికలు ఏర్పడినట్టు తెలుస్తోంది. 14 నెలలపాటు నిత్యం దినదినగండంగా అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ - జెడి(ఎస్) కూటమి ఇప్పుడు ఎవరిదారి వారుగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ పతనం ఇప్పటి వరకు కూటమి నేతలు ఉమ్మడిగా సమావేశం కాకపోవడం గమనార్హం. కొద్దీ నెలలో జరుగనున్న ఉపఎన్నికలలో ఎవరిదారి వారిదిగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. 

దీనికి తోడు గురువారం సాయంత్రం కాంగ్రెస్‌ సీనియర్ నేతలందరూ సమావేశమై 17 మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కలియ తిరగాలని తీర్మానం చేసుకోవడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. రాజీనామా చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ అనర్హత కత్తి  దూసిన విషయం తెలిసిందే. ఆరు నెలల్లోపు ఈ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లు కనపడుతోంది.

పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ రావ్‌ గుండు అధ్యక్షతన సీనియర్లు సమావేశమయ్యారు. కూటమి విడిపోతుందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘బలపరీక్షలో ఓడినంత మాత్రాన కూటమి విడిపోతుందని చెప్పలేను కానీ ఆ నిర్ణయం మాత్రం అధిష్ఠానం చేతుల్లో ఉంది. ఉప ఎన్నికల్లో కూటమితో కలిసి పనిచేయలేమని మా పార్టీలో కొందరు అంటున్నారు. మేం కలిసి పోటీ చేస్తే బిజెపి లాభపడుతుందనేది మాత్రం వాస్తవం ’అని తెలిపారు.

దినేశ్‌ వ్యాఖ్యలపై జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ..‘ కూటమిలో కొనసాగాలని కాంగ్రెస్‌ భావించడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. అదే గనక నిజమైతే విడివిడిగా పోటీ చేయడం తప్ప చేసేదేం లేదు. ఉప ఎన్నికల తర్వాతైన వాళ్లు చేసిన తప్పేంటో వారికి తెలిసి వస్తుంది. ఈ కూటమి విషయాన్ని దేవెగౌడ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీకే వదిలేస్తున్నాను’ అని తెలిపారు.