వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్‌

అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డేలకు సారథ్య బాధ్యతలు చేపట్టిన క్రీడాకారిణీగా భారత క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు 195 వన్డేలు ఆడిన మిథాలీరాజ్‌ 118 వన్డేలకు నాయకత్వం వహించింది. దీంతో అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన క్రీడాకారిణీగా మిథాలీరాజ్‌ అరుదైన మైలురాయిని అందుకుంది.

ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ప్రస్తుతం మిథాలీరాజ్‌ నాయకత్వంలోని టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా ఆతిథ్య లంకతో భారత్ మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఈ రోజు తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌కు నాయకత్వం వహించిన మిథాలీ రాజ్‌ ఈ అరుదైన ఘనతను అందుకుంది.

ఇప్పటి వరకు ఈ రికార్డు ఇంగ్లాండ్‌ మాజీ క్రీడాకారిణి చార్లెట్‌ ఎడ్వర్ట్స్‌ (117) పేరిట ఉంది. ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారిణి బెలిందా క్లార్క్‌ (101) ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ ముగ్గురు మాత్రమే వందకు పైగా వన్డే మ్యాచ్‌లకు నాయకత్వం వహించారు. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ సుజీ బేట్స్‌ ప్రస్తుం 76 వన్డేలకు నాయకత్వం వహించి ఈ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

2004లో మిథాలీ రాజ్‌ కెప్టెన్సీ పగ్గాలు అందుకుంది. భారత మహిళల క్రికెట్‌ జట్టుకు పిన్న వయస్సులోనే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న క్రికెటర్‌ కూడా మిథాలీనే కావడం విశేషం.