మీ గతం మరచిపోకండి... కాంగ్రెస్‌పై అమిత్‌షా విసుర్లు

చట్టాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అంతే దీటుగా తిప్పికొట్టారు. 'మీరా మమ్మల్ని విమర్శించేది?' అంటూ ఎదురుదాడి చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) సవరణ బిల్లు (యుఏపీఏ)పై శుక్రవారంనాడు రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 147 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 42 మంది ఎంపీలు ఓటు చేశారు.

వ్యక్తులనూ ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు వెసులుబాటు కల్పించే ఈ బిల్లు ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైనదని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అమిత్‌షా చర్చలో పాల్గొంటూ 'ఎమర్జెన్సీ సమయంలో ఏమి జరిగింది? మొత్తం మీడియాపై నిషేధం విధించారు. ప్రతిపక్ష నేతలందర్నీ జైళ్లకు పంపారు. 19 నెలల పాటు ప్రజాస్వామ్యం అనేది లేదు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మీరా మమ్మల్ని విమర్శించేది? దయచేసి ఒకసారి మీరు గతాన్ని గుర్తు చేసుకోండి' అని చురకలు వేశారు.

కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంను ఉద్దేశించి మాట్లాడుతూ, ఒక సంస్థపై నిషేధం విధిస్తే, అదే వ్యక్తులు మరో సంస్థతో ముందుకొస్తుంటారని, ఎంతకాలం ఇలా సంస్థలను నిషేధించుకుంటూ పోతామని ప్రశ్నించారు. ఉగ్రవాదంపై ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని తాము బలంగా నమ్ముతామని, అందుకోసం యూపీఏ 2004, 2008, 2013లో తీసుకువచ్చిన సవరణలను బీజేపీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.

ఉగ్రవాదానికి మతం అనేది లేదని, మానవత్వానికి ఉగ్రవాదం వ్యతిరేకమని తాము చాలా బలంగా విశ్వసిస్తామన్నారు. తాము తెస్తున్న సవరణల బిల్లు వ్యక్తులకో, ప్రభుత్వాలకో వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. గతంలో ఈ తరహా కేసులను రాజకీయ కక్ష సాధింపు కోసం ఉపయోగించారని, యూఏపీఏ బిల్లును ఓ మతాన్ని టార్గెట్‌ చేస్తుందనే దుష్ర్పచారం సాగిందని చెప్పారు.