గతంలో కన్నా రెట్టింపు అభివృద్ధి చేసాం...ఫడ్నవిస్

గతంలో 15 ఏళ్ళ కాంగ్రెస్-ఎన్సీపీ పాలనతో తన ఐదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు రావాలని ప్రతిపక్షాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సవాల్ చేశారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఐదేళ్ల పాలన గురించి ప్రజలకు వివరించడానికి చేపట్టిన మహాజన సందేశ్ యాత్రను గురువారం అమరావతి నుండి ప్రారంభిస్తూ గత ప్రభుత్వం కన్నా మేము రెట్టింపు అభివృద్ధిని చేయలేదని నిరూపిస్తే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగబోమని స్పష్టం చేశారు.

రైతు సంక్షేమానికి ఈ ఐదేళ్లలో రూ 50వేల కోట్లను మహారాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. అయితే, పదిహేనేళ్లలో గత కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రభుత్వం రూ  20వేల కోట్ల కన్నా తక్కువ మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. ఈనెలలో రెండు విడతలుగా ఈ యాత్ర సాగనుంది. ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభమైన తొలి విడత యాత్ర తొమ్మిదో తేదీ వరకు జరుగుతుంది.

ఐదేళ్లలో రాష్ట్ర పురోభివృద్ధికి బీజేపీ చేసిన కృషిని ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో అమరావతికి సమీపంలోని మొజారీలో ప్రారంభమైన ఈ యాత్రలో 2017లో భారీ ఎత్తున రైతు రుణమాఫీని తమ ప్రభుత్వం చేసిందని ఫడ్నవిస్ వెల్లడించారు.

రాష్ట్ర ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న 700 కిలోమీటర్ల ముంబయి-నాగ్‌పూర్ మెగా కారిడార్ రోడ్డు ప్రాజెక్టు వచ్చే సంవత్సరం ఆఖరు నాటికి పూర్తి కానుందని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఐదేళ్లలో 30వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించినట్లు చెప్పారు. ఐదేళ్లలో ఇంత నిడివి గల రోడ్ల నిర్మాణం దేశంలో కేవలం మహా రాష్ట్ర లో మాత్రమే జరిగిందని పేర్కొన్నారు.

వారు 15 ఏళ్ళల్లో 10 వేల ఎకరాలకు మాత్రమే అదనపు సాగు సదుపాయం కల్పిస్తే, తాము ఐదేళ్లల్లో అదనంగా లక్ష ఎకరాలకు కల్పించామని చెప్పారు. ఐదేళ్లలో తన పరిపాలన పనితీరుపై ప్రజలు పూర్తిగా సంతృప్తితో ఉన్నారని భావిస్తున్నట్లు ఫడ్నవిస్ వెల్లడించారు.

ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా మతపరమైన అల్లర్లు చోటు చేసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చెప్పారు. మోదీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలు, రైతుల పక్షాన నిలిచిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.