ఏటా రూ.189 లక్షల కోట్ల అవినీతి

ప్రపంచవ్యాప్తంగా అవినీతి సాలీనా 189 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని, ఇది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో ఐదోవంతు అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ చెప్పారు. హవాలా, పన్నుల ఎగవేత, అక్రమ ఆర్థిక వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచశాంతి, అంతర్జాతీయ భద్రత దిశగా అవినీతిపై పోరాటం అనే అంశంపై జరిగిన సదస్సులో గుటేరస్ ప్రసంగించారు. పేద, ధనిక అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలనే తారమత్యం లేకుండా అవినీతి విశ్వవ్యాప్తమైపోయిందని ఆందోళన వ్యక్తం చేసారు.

ఏటా ప్రపంచవ్యాప్తంగా అవినీతిలో నేరుగా చేతులు మారుతున్న సొమ్ము రూ.72.73 లక్షల కోట్ల వరకు ఉంటుందని ప్రపంచ ఆర్థిక సదస్సు అంచనా వేసింది. అవినీతికారణంగా సమాజంలో పేదరికం, ఆకలి మరింత తీవ్రమవుతున్నది.

 అస్థిరత, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదానికి అవినీతితో సంబంధముంది. అందుకే సంక్షోభాలు నెలకొన్న దేశాల్లో అవినీతి ఎక్కువగా ఉంటున్నది. అవినీతి పెరుగుతున్న నేపథ్యంలో తమ నేతలను చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది అని గుటేరస్ తెలిపారు.