పోలవరం నుండి నవయుగ తొలగింపు

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల నుండి తప్పుకోవాలంటూ నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీరు బి.సుధాకర్‌బాబు పేరిట జలనవనరుల శాఖ గురువారం నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. 

పోలవరంలో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని, రీ టెండరింగ్‌కు వెళ్లాలని నిపుణుల కమిటీ సూచించిన విషయం తెలిసిదే. కమిటీ సిఫార్సుల అమలులో భాగంగా తొలివిడతగా నవయుగపై వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలో మరికొన్ని నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనుల్లో మిగిలిన ఉన్న రూ 1244.35 కోట్ల పనులు నవయుగకు అప్పగించారు. వీటిని ఈ నెల 26వ తేదికి ఆ సంస్థ పూర్తిచేయాల్సిఉంది. ఆ తరువాత మరో రూ 918.76 కోట్ల పనులను కూడా నవయుగకు ఇచ్చారు. ఈ పనులను కూడా అదే తేదికి పూర్తి చేయాల్సిఉంది. ఇవిగాక, మరో రూ 751 కోట్ల విలువైన కాఫర్‌ డ్యామ్‌, ఎర్త్‌కమ్‌ర్యాక్‌ డ్యామ్‌, అప్రోచ్‌ చానల్‌ నిర్మాణంలో మిగిలిఉన్న పనులను ఈ సంస్థకు అప్పగించారు. 

వాస్తవానికి ఈ పనులను ట్రాన్స్‌ట్రారు చేయాల్సిఉంది. వివిధ కారణాలతో ఆ సంస్థ సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో అప్పటి ప్రభుత్వం నవయుగకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పనుల్లో పురోగతి కనిపించలేదు. మరోవైపు ఎన్నికల తరువాత అధికారం చేపట్టిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నవయుగకు పనులు అప్పగించిన విధానాన్నే తప్పు పట్టింది. ఇపిసి నిబంధనల్లోని 60 సి ప్రకారం మార్గదర్శకాలకు ఇది విరుద్ధమని పేర్కొంది. 

అలాగే పనుల మొత్తాన్ని ఇష్టం వచ్చినట్లు పెంచారని, ఆ స్థాయిలో రేట్లు పెరగడానికి హేతుబద్దత లేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నవయుగను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జారీ చేసిన నోటీసులలో 89.3 క్లాజు ప్రకారం నవయుగను పోలవరం పనుల నుండి టెర్మినేట్‌ చేసి, కొత్తగా టెండర్లు పిలవడం ద్వారా నూతన సంస్థకు పారదర్శక పద్దతులలో అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

 ' ఒప్పందాన్ని ప్రీ క్లోజ్‌, లేదా టెర్మినేట్‌ చేయడానికి నిర్ణయించినందువల్ల పరస్పర సమ్మతికి రావడానికి మీకు 15 రోజులు గడువు ఇస్తున్నాం. ఆ లోగా మీరు సంబంధిత అధికారిని కలిసి పరిష్కారానికి రావాలి'అని నోటీస్‌లో ప్రభుత్వం పేర్కొంది.