కేసీఆర్ పై ప్రభుత్వ ఉద్యోగుల కన్నెర్ర

ఉద్యోగులకు, పింఛనుదారులకు మధ్యంతర బృతిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గత హామీలపై ఎటువంటి నిర్ణయం ప్రకటించకుండా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడంతో ప్రభుత్వ ఉద్యోగులు కెసిఆర్ పై కన్నెర చేస్తున్నారు. అదుగో మధ్యంతర భృతి(ఐఆర్). ఇదిగో మధ్యంతర భృతి. సీఎం కెసీఆర్ 25 శాతం వరకూ ఇద్దామనుకుంటున్నారు. కానీ ఆర్థిక శాఖ మాత్రం 18 శాతానికే ఫైలు రెడీ చేసింది.

ఇదీ గత వారం రోజులపాటి సచివాలయంలో సాగిన చర్చ. పత్రికలలో జరిగిన ప్రచారం. కానీ అసలు మధ్యంతర భృతి ఊసే లేకుండా కెసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. సీఎం కాస్తా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోయారు. దానితో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం కెసీఆర్ తీరుపై మండిపడుతున్నారు. ఓ వైపు విద్యుత్ ఉద్యోగులకు అడిగిన దానికంటే ఎక్కువ పీఆర్సీ ప్రకటించి, తమను నిర్లక్ష్యం చేయటంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ప్రకటిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కెసీఆర్ సీఎం అయిన తర్వాత తొలిసారి ఇచ్చిన పీఆర్సీపై ఉద్యోగులు సంతృప్తికరంగానే ఉన్నా ఎన్నికల సమయంలో పీఆర్సీ వేసి కనీసం అసలు మధ్యంతర భృతి కూడా ప్రకటించకుండా అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోవటం ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. కంట్రిట్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాల్సిందిగా ఉద్యోగ సంఘాలు కోరుతున్నా కెసీఆర్ ఏ మాత్రం పట్టించుకోలేదు

గతంలో ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. ఎందుకంటే వీరి సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు ప్రభావితం చేయటంలో కూడా వీరు కీలకపాత్ర పోషిస్తారు. ముఖ్యంగా టీచర్లు ఇందులో ముందు వరసలో ఉంటారు. మరి కెసీఆర్ ఆగమేఘాల మీద అన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు కానీ ఉద్యోగులను మాత్రం విస్మరించారు. ఈ ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు 43 శాతం మేర మధ్యంత భృతి(ఐఆర్‌) ఇవ్వాలని ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్యకార్యచరణ సమితి (ఐకాస) విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న 600 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావటం, నూతన పింఛను విధానం రద్దు, ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి 60 ఏళ్లకు పెంపు తదితర 13 డిమాండ్లనూ నెరవేర్చాలని కోరింది. ప్రస్తుతం ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం అయినప్పటికీ ఐఆర్‌ తదితరాలపై నిర్ణయాలను తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జోషిని కలసి వివరించింది. ఈ విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని సీఎస్‌ పేర్కొన్నారు.

నూతన పీఆర్‌సీకి అనుగుణంగా వేతనాలను స్థిరీకరించే వరకు అందజేసే ఐఆర్‌ను 43 శాతం, మూలవేతనాల్లో పెంపు (ఫిట్‌మెంట్‌)ను 63 శాతం మేర సాధించుకోవాలని ఉద్యోగ సంఘాల ఐకాస తీర్మానించింది. ఐకాస ఛైర్మన్‌ కారం రవీందర్‌ రెడ్డి నేతృత్వంలో వివిధ సంఘాల ముఖ్యనేతలు హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్‌లో భేటీ అయ్యి ఉద్యోగులు, పింఛనుదారుల సమస్యలపై చర్చించారు. రు ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తు కార్యాచరణను చేపడతామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తక్షణమే తాత్కాలిక భృతి(ఐఆర్‌) ప్రకటించాలని, ఎన్నికలకు ముందే సమంజసమైన ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్‌సీని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కుడా డిమాండ్‌ చేశాయి.