మరికొన్ని ఉత్పత్తులపై తగ్గనున్న పన్నుల భారం

ఇప్పటికే పలు ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్‌, మరికొన్ని ఉత్పత్తులపై కూడా పన్ను రేట్లను తగ్గించబోయెందుకు సిద్దపడుతున్నది. ఒకవేళ రెవెన్యూలు పెరిగితే, మరిన్ని ఉత్పత్తులపై కూడా జీఎస్టీ రేట్ల కోత ఉంటుందని ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. జీఎస్టీ చట్టాల గురించి లోక్‌సభలో మాట్లాడిన పీయూష్‌ గోయల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. పీయూష్‌ గోయల్‌ ప్రసంగానికి విపక్షాలు పలుమార్లు అడ్డుపడినప్పటికీ, మంత్రి తన స్పీచ్‌ను కొనసాగించారు. 

‘గత సమావేశాల్లో చాలా ఉత్పత్తులు, సర్వీసులపై జీఎస్టీ కౌన్సిల్‌ పన్ను రేట్లను తగ్గించింది. ఈ పరోక్ష పన్ను విధానం ద్వారా వినియోగదారులపై ఉన్న పన్ను భారాన్ని కాస్త తగ్గించాలనుకుంటున్నాం. గత ఏడాదిగా జీఎస్టీ కౌన్సిల్‌ 384 ఉత్పత్తులు, 68 సర్వీసులపై పన్ను రేట్లను తగ్గించింది. 186 ఉత్పత్తులు, 99 సర్వీసులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది. శానిటరీ ప్యాడ్స్‌ కూడా జీఎస్టీ మినహాయింపు పొందిన ఉత్పత్తుల్లో ఉన్నాయి’ అని పియూష్ గోయల్ తెలిపారు.

దేశీయ ఆర్థిక లోటుకు అనుగుణంగా జీఎస్టీని సేకరిస్తున్నామని చెప్పారు. అంచనావేసిన దానికంటే భారత వృద్ధి మెరుగ్గానే ఉందని ఆయన పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ విడుదల చేసిన రిపోర్టులో కూడా 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7.5 శాతంగా ఉంటుందని అంచనావేసింది.