‘ఉన్నావ్‌’ నిందితుడిపై బిజెపి బహిష్కరణ వేటు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఉన్నావ్‌’ బాధితురాలి హత్యాయత్నం కేసులో అంశం మరో మలుపు తీసుకుంది. ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిజెపి  ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఇదివరకే పార్టీ నుండి సస్పెండ్ చేసింది.

బాధితురాలు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉన్నావ్‌ అత్యాచార ఘటన మరోసారి తెరమీదకు వచ్చింది. నిందితుడు సెంగార్‌, అతడి బంధువులు ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ నంబర్‌ ప్లేట్‌ మీద నలుపు రంగు పెయింట్‌ వేయడం ఈ ఆరోపణలకు ఆజ్యం పోసింది.

ఈ ఘటనపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంపై సుప్రీంలో పిటిషన్‌ కూడా దాఖలైంది. ఈ కేసు విచారణను వారం రోజుల్లోగా పూర్తి చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సీబీఐకి స్పష్టం చేసింది. ఇక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని దిల్లీకి తరలించాలా..? వద్దా..? అన్న అంశంపై వైద్య నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 

ఉన్నావ్‌ అత్యాచార ఘటనకు సంబంధించి అన్ని కేసులు ఉత్తరప్రదేశ్‌ నుంచి దిల్లీకి బదిలీ చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది. మరోవైపు బాధితురాలికి రక్షణగా ముగ్గురు పోలీసు అధికారులను అప్పట్లో నియమించారు. ఆమెకు ప్రమాదం జరిగిన తర్వాత వారిని సస్పెండ్‌ చేశారు.