తెలంగాణలో ‘క్రియాశీల’ సభ్యుడిగా అమిత్ షా

తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయడంపై దృష్టి సారించిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఇక్కడి నుండే పార్టీ క్రియాశీల సభ్యత్వం స్వీకరించనున్నారు. రాష్ట్రంలో బిజెపి సభ్యత్వాల్ని భారీగా పెంచాలని ఇప్పటికే రాష్ట్ర పార్టీకి స్పష్టం చేసిన ఆయన స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. గుజరాత్‌లో సాధారణ సభ్యత్వం ఉండగా, తెలంగాణ నుంచి పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని నిర్ణయించారు. 

ఈ సభ్యత్వం రావాలంటే ముందు 50 మందిని పార్టీలో చేర్పించాలి. దీనికోసం అమిత్‌షా ఈనెల 16 లేదా 17వతేదీన రాష్ట్ర పర్యటనకు రానున్నారు. రాష్ట్రంలో బిజెపికి 18 లక్షల సభ్యత్వం ఉంది. కొత్తగా 12 లక్షలమందిని చేర్పించి దాన్ని 30 లక్షలకు తీసుకెళ్లాలని పార్టీ తొలుత అనుకుంది. ఇక్కడ బిజెపి బలపడేందుకు ఈ లక్ష్యం చాలదని, కొత్త సభ్యత్వాలు 18 లక్షలు చేయించాలని అమిత్‌షా రాష్ట్ర పార్టీకి నిర్దేశించారు. 

జులై 6న దేశవ్యాప్తంగా ప్రారంభమైన బిజెపి సభ్యత్వ నమోదులో తొలిరోజునే హైదరాబాద్‌కు వచ్చిన అమిత్ షా తెలంగాణకు తానిస్తున్న ప్రాధాన్యంపై పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపించారు. తాజాగా రాష్ట్రంలో బిజెపి క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని ఆయన నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంటింటికీ వెళ్లి 50 మందిని బిజెపిలో అమిత్‌షా చేర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూ.100 చెల్లించి క్రియాశీల సభ్యత్వం తీసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఒకచోట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జులై 6 నుంచి 30 వరకు కొత్తగా 6 లక్షల మంది పార్టీలో చేరినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అత్యధికంగా 45 వేల మంది చొప్పున కొత్త సభ్యులు చేరారు. మరో 12 లక్షల మందిని చేర్పించాలని  లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు 1-7 వరకు జరిగే ప్రత్యేక డ్రైవ్‌లో భారీగా సభ్యత్వాలు చేసేందుకు బిజెపి ఏర్పాట్లు చేస్తోంది. పూర్తిగా వారంపాటు ఇందులో పాల్గొనేందుకు 7 వేల మంది పార్టీ విస్తారక్‌లను బిజెపి రంగంలోకి దించబోతోంది.